ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభ.
* సభ నిర్వహణకు కఠిన నిబంధనలతో అనుమతినిచ్చిన ఢిల్లీ పోలీసులు.
న్యూఢిల్లీ, మహా.
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో వచ్చే నెల నవంబర్ 1న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి దిల్లీ పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అయితే ఈ సభ నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు కచ్చితంగా పాటించాల్సిన పలు కఠిన నిబంధనలను పోలీసులు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) వివాదం, ఎన్నికల నిర్వహణలో తలెత్తిన అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన ఈ మహాసభకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ప్రతిష్టాత్మక బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రముఖ విపక్ష నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన సభను నిర్వహిస్తున్నారు. రామ్‌లీలా మైదానంలో సభ ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం అంగీకరించినప్పటికీ, మైదాన యాజమాన్య సంస్థ నుంచి విధిగా ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
పోలీసులు విధించిన నిబంధనల ప్రకారం.. ఈ సభను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే నిర్వహించాలి. సాయంత్రం 5 గంటల్లోగా కార్యక్రమం పూర్తిగా ముగియాలని, సభ ముగిసిన వెంటనే హాజరైన వారంతా మైదానం నుంచి వెళ్లిపోయేలా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రామ్‌లీలా మైదానంలో రాత్రి ఎవరూ బస చేయడానికి వీల్లేదని, సభకు ముందు, ఆ సమయంలో లేదా అనంతరం ఎక్కడా రాత్రిపూట బస చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు.
సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతను పర్యవేక్షించేందుకు కీలక ప్రదేశాల వద్ద హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించారు. వీటితో పాటు ప్రజలకు తాగునీరు, మరుగుదొడ్ల వసతి, స్వచ్ఛంద సేవకుల (వాలంటీర్ల) నియామకం వంటి కనీస సౌకర్యాలన్నీ నిర్వాహకులే సమకూర్చాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు లేదా ఉద్రిక్తతలు సృష్టించే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టే లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే, నిర్వాహకులే వెంటనే మైకులు నిలిపివేసి సంబంధిత వ్యక్తిని వేదిక నుంచి తొలగించాలని ఆదేశించారు.
అలాగే రామ్‌లీలా మైదానం నుంచి సభ ముగిసిన తర్వాత మరే ఇతర ప్రాంతానికీ ఊరేగింపుగా వెళ్లడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.







