Mahaa Daily Exclusive

  ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి అగ్రనేతల ఫుల్ ఫోకస్…

Share

ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి అగ్రనేతల ఫుల్ ఫోకస్.
* కూటమి ధర్మం పాటించాల్సిందేనని స్పష్టీకరణ.
* అధికారిక అభ్యర్థుల గెలుపునకు మూడు పార్టీల కేడర్ కృషి చేయాలి.
* చంద్రబాబు, పవన్, మాధవ్ పిలుపు

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఎన్డీఏ కూటమి నాయకత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పాటించాల్సిన విధివిధానాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మంగళవారం సంయుక్తంగా ఒక కీలక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఉమ్మడి భేటీ ద్వారా కూటమి నేతలు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికల సమరంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కూటమి ధర్మం పాటించడం అందరి బాధ్యత
రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవడానికి, స్థానిక ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించడానికి కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని అగ్రనేతలు స్పష్టం చేశారు. మూడు పార్టీల సమన్వయంతోనే క్షేత్రస్థాయిలో అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారికంగా కూటమి బీ-ఫారాలు పొందిన అభ్యర్థులను గెలిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సైనికులా కష్టపడి పనిచేయాలని సూచించారు.
తిరుగుబాటు అభ్యర్థులకు హెచ్చరిక.. నామినేషన్ల ఉపసంహరణకు ఆదేశం
కూటమి పార్టీల అధినాయకత్వాల నిర్ణయానికి విరుద్ధంగా, ఎలాంటి అనుమతి లేకుండా పోటీకి దిగాలనుకునే రెబల్స్ లేదా అనధికార అభ్యర్థులు వెంటనే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని గట్టిగా ఆదేశించారు. కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో నిలిస్తే వారిపై పార్టీలపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పొత్తులో భాగంగా ప్రస్తుతం అవకాశాలు దక్కించుకోని వారికి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులతో పాటు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ భరోసా కల్పించారు. కూటమి ఐక్యతే మన బలమని, స్థానిక సంస్థల పోరులోనూ సత్తా చాటి ప్రతి స్థానాన్ని కైవసం చేసుకుందామని కేడర్‌ను సమాయత్తం చేశారు.