కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహగానాలు వెల్లువెత్తిన వేళ.. వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని శివకుమార్ తెలిపారు. ‘‘ఆయన మా పార్టీ అధ్యక్షుడు. మా నాయకుడు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనను నేను రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఖర్గేను కలిశా. బెంగళూరులో పార్టీ కొత్త కార్యాలయం శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం. ఈ సందర్భంగా ఆయనతో ఎన్నో విషయాలపై చర్చించా’’ అని డీకే వెల్లడించారు. కాగా.. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు స్వీకరిస్తారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన పార్టీ మారనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే సీఎం కావడం ఖాయమని.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఆయన సీఎం పదవి చేపట్టడం అనేది కాలపరిమితితో కూడుకున్నదని, అయితే అది కచ్చితంగా జరుగుతుందన్నారు.








