రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నేడు ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాకు నాయకులు కార్యకర్తలు తరలిరావాలని సిపిఐ నాయకులు కే రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి హాజరై పార్టీ శ్రేణులతో కలిసి, ఆపరేషన్ ఖగార్ పేరిట కొనసాగిస్తున్న అత్యాకాండను వెంటనే ఆపాలని, నేడు ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాకు, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సిపిఐ నాయకులు కే రామస్వామి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపరేషన్ ఖగార్ పేరిట 2024 జనవరి నుండి మావోయిస్టులను అణిచివేసే పేరిట, ఆదివాసులతో పాటు, మావోయిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు హతమారుస్తున్నారు. గత 17 నెలల్లో హతమార్చిన వారిలో దాదాపు 540 మందిలో మూడోవంతు పైగా ఆదివాసులే ఉన్నారు. అభివృద్ధి పేరిట, రాజ్యాంగంలోని చట్టాలలో పేర్కొన్న ఆదివాసుల హక్కులను కాలరాచి వేయడం జరుగుతుందని, ప్రకృతి వనరులు ఖనిజ సంపదను, స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు లబ్ధిచేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఈ హత్యాకాండను కొనసాగిస్తుందని అన్నారు. ఈ హత్యాకాండను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్టల ప్రాంతాన్ని వేలాదిమంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, 31 మందిని అతి దారుణంగా లొంగిపోతామన్నా వదలకుండా, వారిని అమానుషంగా తుపాకీ తూటాలతో బలిగొన్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కనీసం చూడనీయకుండా, వారి కుటుంబాలకు అప్పచెప్పకుండా దహన సంస్కారాలు కూడా సాయుధ బలగాలు దహనం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉగ్రవాద శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్ దేశ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి మాత్రం మోడీకి మనసు వస్తుంది కానీ, భారతదేశ పౌరులుగా పుట్టినటువంటి మావోయిస్టులతో మాత్రం చర్చలు జరపకుండా హత్యాకాండ చేయడం దుర్మార్గమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాంతి చర్చల కమిటీ పిలుపుమేరకు నేడు ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాను నిర్వహించడం జరుగుతుందని, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహా ధర్నాకు ప్రజలు కవులు కళాకారులు రచయితలు ప్రజాసంఘాల నాయకులు పార్టీ శ్రేణులు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభులింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, లలిత, శ్రీకాంత్, పెంటయ్య, నరసింహులు యాదమ్మ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.








