ఖమ్మం,మహా.
నగర ప్రజలకు మెరుగైన వసతుల కల్పన చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పన్నులు చెల్లించే ప్రజలకు మెరుగైన వసతుల కల్పన బాధ్యత నగరపాలక సంస్థ పై ఉందన్నారు. రహదారులు, పారిశుద్ధ్యం, వసతుల కల్పన పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
పారిశుద్ధ్యం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రోడ్లు, డివైడర్లు, కూడళ్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రతిరోజూ పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టనున్నట్లు కలెక్టర్ అన్నారు. డివైడర్ల వెంబడి, రోడ్డు కిరువైపుల పిచ్చి మొక్కలు శుభ్రపరచాలన్నారు. మీడియన్స్ లో అతిగా పెరిగిన మొక్కలు కట్ చేయడం జరగాలన్నారు. సైన్ బోర్డ్, సూచికలు ఒరగడం, పడిపోవడం జరిగితే సరిదిద్దాలన్నారు.
పబ్లిక్ టాయిలెట్ ల నిర్వహణ పటిష్టంగా చేయాలన్నారు. ప్రతి పబ్లిక్ టాయిలెట్ వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేసి, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, ప్రజల్లో ఈ దిశగా అవగాహన కల్పించాలని అన్నారు. అందుబాటులో ఉన్న మెషినరీ, వాహనాలు రన్నింగ్ కండీషన్ లో ఉండాలని, సమర్థవంతంగా అంతటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్లాంటేషన్ చక్కగా చేపట్టాలన్నారు. అన్ని రోడ్లు, డివైడర్లలో వంద శాతం ప్లాంటేషన్ చేయాలన్నారు.
ఈ సంవత్సరం పన్నుల డిమాండ్. 31 కోట్లు, బకాయిలు 14 కోట్లు, మొత్తం 57 కోట్లు ఉన్నట్లు కలెక్టర్ అన్నారు. బకాయిల వసూలుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బకాయిదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి వరకు కాకుండా డిసెంబర్ లోగానే పన్నుల వంద శాతం వసూలుకు కార్యాచరణ చేసి, బిల్ కలెక్టర్ లకు రోజువారీ లక్ష్యం పెట్టి, ఆ దిశగా వసూలుకు చర్యలు చేపట్టాలన్నారు.
రోడ్ల విస్తరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నగరంలో 4 మేజర్ రోడ్ల విస్తరణ పనులు పురోగతి లో ఉన్నట్లు, డిమాలిష్ పూర్తయి, డ్రయినేజీ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పనుల్లో స్థలాలు కోల్పోతున్న అర్హులైన అందరికి పరిహారం అందజేయాలన్నారు. నిరుపేదలు స్థలాలు కోల్పోతే, డబల్ బెడ్ రూమ్ లు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాణిజ్య సముదాయాల దగ్గర ఫుట్ పాత్ ఉండాలన్నారు. నగరంలో 40265 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు, దరఖాస్తు రుసుము చెల్లించిన దరఖాస్తుదారుల క్షేత్ర పరిశీలన పూర్తిచేయాలన్నారు.
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. పబ్లిక్ హెల్త్ విభాగంచే చేపడుతున్న అమృత్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 100 కోట్లతో 68 వివిధ అభివృద్ధి పనులు మంజూరు కాగా, 24 పనులు పూర్తి అయినట్లు, 19 పనులు పురోగతి లో ఉండగా, 24 పనులు ఇంకనూ ప్రారంభం కాలేదన్నారు. ఖిలా రోప్ వె కి భూసేకరణ పూర్తయినట్లు అన్నారు. కబేలా కు రెవెన్యూ శాఖ సహకారంతో స్థల సేకరణ చేయాలన్నారు.
నగరంలో 105.65 కోట్లతో 388 సివిల్ పనులు మంజూరు కాగా, 190 పనులు పూర్తి అయినట్లు, 112 పనులు పురోగతి లో ఉండగా, 30 పనులు ఇంకనూ ప్రారంభం కాలేదన్నారు.
అగ్రిమెంట్ పూర్తయిన పనులు వెంటనే మొదలెట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఒకే కాంట్రాక్టర్ కొన్ని పనులు చేస్తున్నప్పుడు, అన్ని పనులు సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. పనుల వెనుకబాటు, నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని కలెక్టర్ అన్నారు.
నెల రోజుల్లో నగరంలో స్పష్టమైన మార్పు రావాలని, నగరం పరిశుభ్రంగా, పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉండాలని కలెక్టర్ అన్నారు. ఖమ్మం నగరం ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తో పనిచేయాలన్నారు.
ఈ సమీక్ష లో సహాయ మునిసిపల్ కమీషనర్ అనిల్, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, డిసిపి రాజ్ కుమార్, ఏసిపి వసుంధర, డిఇ లు, ఏఇ లు, సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, జవాన్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







