Mahaa Daily Exclusive

  నిర్ణీత గడువు లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

ఖమ్మం, మహా.
ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యల పై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

జిల్లా కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శనివారం నగరంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఖానాపురంలోని నూతనంగా నిర్మిస్తున్న యు.పి.హెచ్.సి. భవన పనులు, బైపాస్ రోడ్, ఖానాపురం ప్రధాన రహదారి లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డైనేజి (యుజిడి) పనులు, సర్ధార్ పటేల్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అథ్లెటిక్ కోర్టు, ఇండోర్ స్టేడియం పనులు, ఇల్లందు క్రాస్ రోడ్ లో ఫుట్ పాత్ పనులను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి మాట్లాడుతూ, నగర ప్రజలే కాక, జిల్లా
ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఇంకా శ్రద్ధ పెట్టి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఖమ్మం నగరం ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలాగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్రింద మురుగు నీటి కాల్వ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని అన్నారు. సర్దార్ పటెల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా వసతుల పనులను నాణ్యతతో ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. స్టేడియాల ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్ కుమార్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.