కూసుమంచి, జులై 26, మహా:
అధిక వర్షాల సమయంలో ప్రత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
శనివారం కూసుమంచి మండలంలోని అగ్రహారం గ్రామంలో ప్రతి పంటను మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధిక వర్షాలకు వల్ల ప్రత్తి పంటను కాపాడుటకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా నీటిని సాధ్యమైనంత త్వరగా తీసివేయాలనీ ,వీలైనంత త్వరగా భూమిలో తేమను తగ్గించడానికి అంతర కృషి చేయాలనీ సూచించారు. దీని ద్వారా భూమిలో తేమ తగ్గి మొక్కలు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. ప్రత్తి విత్తుకొని 30-40 రోజులు దశలో ఉన్న పంటకు ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కకు 5 – 7 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి.
అధిక వర్షాలకు అక్కడక్కడ వేరు కుళ్ళు తెగులును గమనించడం జరిగిందని , దీని నివారణకు వెంటనే కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్ళ లో తడపాలనీ సూచించారు. మరికొన్నిచోట్ల అధిక వర్షాలకు లేత పసుపు రంగుకు మారిన మొక్కలను గమనించడం జరిగిందని, దీని నివారణకు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మొక్కలు సాధారణ స్థితికి వస్తాయి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టుసింగారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వంశీకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.







