మహా భద్రాచలం
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరిగిందని సిపిఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. రెండు రోజులు పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించేందుకు భద్రాచలం వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ,గోదావరి వరదలు ప్రతి ఏటా భద్రాచల పట్టణాన్ని ముంచెత్తుతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే వరదల తీవ్రత పెరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల ఉత్పన్నమయ్యే బ్యాక్ వాటర్ ముంపు పట్టణ అభివృద్ధికి అడ్డంకి మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్రం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భద్రాచలానికి తీవ్ర నష్టం సంభవిస్తుందని ఆయన అన్నారు. చారిత్రిక నేపథ్యం గల భద్రాచలం శ్రీరాముని దేవాలయం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత విడాలని అన్నారు.
పరిష్కారం చేయవలసిన బాధ్యత కేంద్రానిదే.
………………….
పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం స్వయంగా గుర్తించినందున దాని ప్రభావం వల్ల కలిగే ప్రతి సమస్యకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బ్రిటాస్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి కాని పునరావాసం ఇంకా పూర్తికాలేదని తెలిపారు.కేంద్రం ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
పరిపాలనా సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలానికి ఇవ్వాలి.
…………………….
భద్రాచలానికి అత్యంత సమీపంలో ఉన్న ఐదు గ్రామపంచాయతీలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిటాస్ అన్నారు. రోజువారీ పనులు విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల కోసం ఈ గ్రామాల ప్రజలు భద్రాచలంపైనే ఆధారపడుతున్నప్పటికీ పరిపాలనా పరంగా వెనుకబడి పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గ్రామాల విలీనం ద్వారా అభివృద్ధితో పాటు, ప్రభుత్వ పథకాలు చేరుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.







