Mahaa Daily Exclusive

  రైతులను ఆదుకోండి. * అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్…!

Share

ఖమ్మం, మహా.
రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల దెబ్బకు రైతాంగం తీవ్ర నష్టాలు చవిచూస్తోందని, వారిని ఆదుకోవటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు.

ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ—ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు ముందుగానే సాగు ప్రారంభించారని, కానీ వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పంటలు నష్టపోయాయని విమర్శించారు.

తరువాతి రోజుల్లో వర్షాభావం, ఆపై అతివృష్టి కారణంగా వరి, పత్తి, పెసర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వరి నార్లు, పత్తి మొక్కలు నీటమునిగి నాశనం కాగా, పెసర చెట్ల మీదే మొలకలు వచ్చి రైతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలను అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేలా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మాలీదు నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, బీరెల్లి లాజర్, బందెల వెంకయ్య, వేపాకుల శివలింగం, గోకినపల్లి లలిత, ఎస్‌.కే.లాల్మీయా, తిమ్మిడి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Latest