ఖమ్మం, మహా.
స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్లకూ విద్యలో కుల, మత, ఆర్థిక అసమానతలు కొనసాగుతుండటంపై పి.డి.ఎస్.యు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయిబోలా మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు మద్దతు ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్వీర్యం చేయడంలో పాలకులు పోటీ పడుతున్నారని ఆక్షేపించారు. పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువులో ముందుకు సాగేందుకు ఉద్దేశించిన స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లలో 8,600 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండటం వల్ల వేలాది మంది విద్యార్థులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యమైన, అంతరాలు లేని సమాన విద్య అందించాలంటే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి, అందరికీ ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, ఎర్ర అఖిల్ కుమార్, నరేందర్, సహాయ కార్యదర్శులు ఎస్.సాయికుమార్, గణేష్, సురేష్, వెంకటేష్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, అంగిడి కుమార్, మునిగల శివ, అజయ్, నాగరాజు, గౌతం, అషూర్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.







