Mahaa Daily Exclusive

  ఏడు బావుల వద్ద మరో విషాదం. * కుటుంబానికే పునరావృతమైన జలగండం…!

Share

వైరా, మహా.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ప్రసిద్ధ ఏడు బావుల జలపాతం వద్ద మళ్లీ ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం జెన్నారం గ్రామానికి చెందిన పామర్తి శ్రీను–లక్ష్మి దంపతుల రెండవ కుమారుడు ప్రేమ్ కుమార్ (23) స్నేహితులతో విహారయాత్రకు వచ్చి జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంపై దుఃఖాంధకారం మళ్లీ కమ్ముకుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే కుటుంబంలో పెద్ద కుమారుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందగా, ఇప్పుడు రెండవ కుమారుడూ అదే విధంగా మరణించడం గ్రామాన్ని, బంధుమిత్రులను కన్నీటి మునిగిపోయేలా చేసింది.

ఫొటో దిగుతుండగా జారి ప్రమాదం

ఎస్ఐ రవికుమార్ వివరాల ప్రకారం, ప్రేమ్ కుమార్ తన మిత్రులతో కలిసి ఏడు బావుల జలపాతానికి వచ్చాడు. రాళ్లపై ఎక్కి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా జారి జలపాతం కిందికి పడి ఏడో బావిలో చిక్కుకున్నాడు. మిత్రులు కేకలు వేయగానే ఆయన నీటిలో కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే చీకటి ముసురుకోవడంతో గాలింపు చర్యలు ఫలించలేదు. ఆదివారం ఉదయం రెస్క్యూ బృందం మృతదేహాన్ని బయటకు తీశి ఇల్లందు ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కన్నీటి మునిగిన తల్లిదండ్రులు

తొమ్మిది ఏళ్ల క్రితం వాగులో పెద్ద కుమారుడిని కోల్పోయిన పామర్తి శ్రీను–లక్ష్మి దంపతులు ఇప్పుడు రెండో కుమారుడి మృతదేహాన్ని చూసి మానసికంగా కూలిపోయారు. వయసు పైబడ్డ ఈ దంపతులకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన కుమారులు జలగండంలో బలైపోవడం వారి భవిష్యత్తును చీకటిలో ముంచింది. ఇంటి ముందర అంత్యక్రియలకు హాజరైన బంధువులు, గ్రామస్థులు తల్లిదండ్రుల బాధను చూసి కంటతడి పెట్టారు.

అధికారుల చర్యలపై ప్రశ్నలు

ఏడుబావుల జలపాతం అందమైన పర్యాటక స్థలం అయినప్పటికీ, ప్రతి సంవత్సరం ప్రాణాలు బలవుతున్నాయి. భద్రతా చర్యలు లేని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ జారే ప్రమాదముందో అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రక్షణ వలయాలు లేకపోవడం వల్ల నిర్లక్ష్యంగా పర్యటకులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షక సిబ్బందిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest