జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన సిపిఎం పార్టీ నాయకులను జూలూరుపాడు పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన పార్టీ జిల్లా నాయకుడు కొండపల్లి శ్రీధర్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు కాకుండా, అనర్హులకు ఇండ్లు మంజూరు చేస్తున్నారని అన్న పాపానికి అరెస్టు చేపించడం సిగ్గుచేటు అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రచారం చెయ్యడం సరైనది కాదని, ఇండ్ల పేరుతో పార్టీ ఫిరాయింపులకు గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకత్వం పాల్పడుతుందని ఆయన అన్నారు. అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ అడిగిన పాపానికి మండల కార్యదర్శిని మండల నాయకత్వాన్ని అరెస్టు చేసి తన పర్యటన కొనసాగించడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అర్హులతో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అదే విధంగా మండల వ్యాప్తంగా గ్రామాలలో పారిశుధ్యం పనులు పడకేసి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని అసహనం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్, పార్టీ మండల కమిటీ సభ్యులు బోడా భిమిత్ర, మాలోత్ రాములు, ఊర్ల వెంకటేశ్వర్లు, వలమల చందర్రావు, పార్టీ శాఖ కార్యదర్శి ఇల్లంకి సీతారాములు తదితరులు ఉన్నారు.







