Mahaa Daily Exclusive

  ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

ఖమ్మం,మహా
జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని, గత సంవత్సరం కంటే నేటికీ 3250 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు సరఫరా చేసామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత, సరఫరాపై సంబంధిత జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం 2700 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని, రైతులు అనవసరంగా గందరగోళానికి గురి కావద్దని అన్నారు.

రైతులు ప్రస్తుత అవసరాలకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని అన్నారు. ఎకరం భూమికి బస్తా యూరియా వేయాల్సి వస్తే ఒకేసారి వేయకుండా 15 రోజులలో 2 దఫాలుగా యూరియా చల్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి రైతుల అవసరం మేరకు మాత్రమే యూరియాను అమ్మేలా చూడాలని అన్నారు. కల్లూరు, తల్లాడ ప్రాంతంలో మరింత మానిటరింగ్ అవసరమని అన్నారు. ఏ.ఈ.ఓ లతో సమన్వయం చేసుకుంటూ లైన్లు లేకుండా సజావుగా యూరియా అమ్మాలని అన్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు తన పరిధిలో రైతులు ఒకేసారి రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు చెప్పులు లైన్ లో పెడ్తున్నారు అనే పరిస్థితి ఉంటే సంబంధిత సొసైటీ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, రైతులు నిర్దేశించిన టైంలో వచ్చి 10 నుంచి 15 నిమిషాలలో యూరియా తీసుకొని వెళ్లేలా ఉండాలని అన్నారు.

యూరియాను అధికంగా కొంటున్న, తరచుగా కొంటున్న వారిని గుర్తించాలని అన్నారు. సన్న, చిన్నకారు రైతులకు యూరియా బ్యాగుల సరఫరాను ప్రాధాన్యతగా చర్యలు తీసుకోవాలని అన్నారు. యూరియా డైవర్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి రోజు యూరియా స్టాక్ వివరాలు అందరికి తెలియజేయాలని అన్నారు.

జిల్లాలో ఎక్కడైనా ఒక చోట అధిక సంఖ్యలో రైతులు యూరియా కోసం వస్తే ఇతర ప్రాంతాల నుంచి స్టాక్ తీసుకుని వచ్చి పంపిణీ చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ రైతులు ధర్నా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా సేల్ పెంచాలని అన్నారు.

యూరియా అందుబాటులో ఉన్న కొంత మంది కావాలని తప్పుడు ప్రచారాలు చేసి రైతులతో ధర్నా చేయించాలని చూస్తున్నారని, అవసరం ఉన్న చోట స్టాక్ కేటాయించి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య,జిల్లా సహకార అధికారి గంగాధర్, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Latest