- హైకోర్టు స్టేపై
- సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తాం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: టీపీసీసీ చీఫ్
- బనకచర్ల విషయంలో అంత చేసింది మీరే.. రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అంటూ వ్యాఖ్య
హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చినందున సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ వెసులు బాటు దొరుకుతదని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ఆపటంలో అసలైన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. బీజేపీ, బీఅరెస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గవర్నర్ దగ్గర బిల్లుని పెండింగ్లో ఉంచారని, గవర్నర్ను నియమించేది ఎవరు? అని ప్రశ్నించారు. మూడు చట్టాలు ఒక ఆర్డినెన్సు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
ఒక్క నీటి చుక్కను వదులుకునే ప్రసక్తే లేదు..
బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో చేయాల్సింది అంత చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఉదాసీనత వల్ల జీవో ఇచ్చారని దుయ్యబట్టారు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాకా కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఫిర్యాదు చేసిందని అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలు అన్ని సర్దుబాటు చేసుకుంటామని వివరించారు. ఆర్ఓబి నిర్మాణాల కోసం కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉందని.. కేంద్రం నిధులు రాకపోవటం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.







