Mahaa Daily Exclusive

  కాళేశ్వరం కహాని..రూ. 400 కోట్ల ఆస్తులు నిషేధం..

Share

  • కాళేశ్వరం కహాని
  • ముగ్గురు ఇంజినీర్లపై విజిలెన్స్ కొరడా
  • రూ. 400 కోట్ల విలువ చేసే ఆస్తులు నిషేధిత జాబితాలోకి

హైదరాబాద్, మహా : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీర్లుగా పని చేసిన ముగ్గురిపై విజిలెన్స్ కొరడా ఝళిపించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టారన్న ఆరోపణలను ఈ ముగ్గురూ ఎదుర్కుంటున్నారు. ఇటీవల గజ్వేల్‌ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీగా పని చేసిన భూక్యా హరిరాం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు జరుపగా కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇంజినీర్లకు విజిలెన్స్ శాఖ షాక్ ఇచ్చింది. వీరికి సంబంధించిన ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేరింది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఉంటుంది. అక్రమాస్తుల కేసులో వీరు బెయిల్‌పై ఉన్నారు. అయితే కోర్టులో ఈ కేసు తేలే వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి క్రయవిక్రయాలు జరిపేందుకు వీలుండదు. ఇంజినీర్ల అవినీతి ఆస్తుల చిట్టాతో ఏసీబీ డైరెక్టర్‌ నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. దీంతో వారి అక్రమ ఆస్తులను అటాచ్‌ చేయాలని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనికి విజిలెన్స్‌ కమిషన్‌ సమ్మతించింది.

బినామీ పేర్ల మీద అక్రమాస్తులు

నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన నూనె శ్రీధర్ ఇళ్లు, బంధువుల ఇళ్లపై జూన్ లో ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్రీధర్ ఆస్తులతో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, బినామీల పేరు మీద మొత్తం రూ.110 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

భూక్యా హరిరాం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్‌ ఇంజినీరుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈయనను కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేలో అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. అప్పటికి హరిరాం గజ్వేల్‌ ఈఎన్సీగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఎండీగా ఉన్నారు. అరెస్టు తర్వాత ఆయన్ను నీటిపారుదల శాఖ సస్పెండ్‌ చేసింది.

మరోవైపు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయిన చీటి మురళీధర్‌కు సంబంధించిన ఆస్తులపై జులైలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులను అక్రంగా కూడబెట్టినట్లు గుర్తించింది. అనంతరం కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేసింది. ఈయన అక్రమాస్తుల విలువ బహిరంగా మార్కెట్‌లో దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచానా వేశారు.

Latest