- ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం
- అన్ని వర్గాలకు సముచితంగా విద్యావకాశాలు
- వర్గీకరణ ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి
- విద్యాశాఖ అధికారులతో సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, మహా:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో విద్యావకాశాల్లో సామాజిక న్యాయం సాధ్యపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఇంతకాలం ప్రొఫెషనల్ కోర్సుల్లో నామమాత్రంగా ఉన్న వర్గాలకు, రిజర్వేషన్ల వర్గీకరణతో ఈ ఏడాది సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు కూడా ఈ ఏడాది మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సముచిత సంఖ్యలో సీట్లు రావడం సంతోషంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఏడాది ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల సీట్లను భర్తీ చేశారు. ఈ మేరకు ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో ఆయా వర్గాల విద్యార్థులకు వచ్చిన సీట్లు, ఇతర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష చేశారు. మంగళవారం ఉదయం సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ, డాక్టర్ యోగితారాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్, జేఎన్‌టీయూ వీసీ కిషెన్ కుమార్ రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంట చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బావురి, మెహతర్, మాంగ్, బేడ బుడగ జంగం, మన్నె, కొలుపులవాండ్లు తదితర అత్యంత వెనుకబడిన కులాల పిల్లలకు ప్రభుత్వ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు.
ఎంబీబీఎస్‌లో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 41 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 561 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 324 సీట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.ఇంజనీరింగ్‌లో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 378 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 8246 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 5466 సీట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఫార్మసీలో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న కులాల పిల్లలకు 60 సీట్లు, ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న కులాల పిల్లలకు 1603 సీట్లు, ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న కులాల పిల్లలకు 898 సీట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. గ్రూప్ 2, గ్రూప్ 3 కులాల పిల్లలు తమకు రిజర్వ్ చేసిన సీట్లతో పాటు, ఓపెన్ కేటగిరీలోనూ పెద్ద సంఖ్యలో సీట్లు సాధించారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి విద్యతోనే సాధ్యం అవుతుందని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఇందుకు అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు.రిజర్వేషన్ల వర్గీకరణతో ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వర్గాల పిల్లలకు కూడా ఉన్నత విద్యావకాశాలు రావడం సంతోషంగా ఉందన్నారు.దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేర్చుకోవడం, మొదటి ఏడాదిలోనే వర్గీకరణ ఫలాలు ఆయా కులాలకు అందడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు.
వర్గీకరణ అనేది అత్యంత వెనుకబడిన కులాల వారికి చేయూతనిచ్చి సామాజిక న్యాయాన్ని సాధించడం కోసమే తప్ప, ఏ కులానికి వ్యతిరేకం కాదు అని తాము మొదట్నుంచీ చెబుతున్నామని, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర సీట్ల కేటాయింపుతో ఇది మొదటి ఏడాదిలోనే నిరూపితం అయిందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే.. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లలో సీట్లు పొందిన ఎస్సీ కులాల విద్యార్థులు, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ అవుట్ అవకుండా చూసుకోవాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు.అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, ఇంగ్లీష్ భాష రాకపోవడం వంటి సమస్యలతో ఆత్మన్యూనత భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని, ఇది డ్రాప్ అవుట్స్‌కు దారి తీస్తుందని మంత్రి హెచ్చరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా విద్యార్థులు ఆత్మన్యూనతకు లోను అవకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వాహించాలని,సైకాలజిస్టులతో మోటివేషన్ క్లాసులు చెప్పించాలని సూచించారు.





