- ఢిల్లీలో టపాసులు పేల్చుకోవచ్చు!
- దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు ఓకే
- ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం
ఢిల్లీ, మహా: ఢిల్లీ పర్యావరణహితమైన బాణసంచా (గ్రీన్ క్రాకర్స్) విక్రయాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. గ్రీన్ క్రాకర్స్‌తో వారిని పండగ చేసుకోవడానికి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అత్యున్నత న్యాయస్థానం ఈ అనుమతి ఇచ్చింది. ‘స్మగ్లింగ్ చేసిన బాణసంచాను వాడటం వల్ల గ్రీన్ క్రాకర్స్ వినియోగించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ పరిస్థితులను బ్యాలెన్స్ చేసేలా చర్యలు ఉండాలి. పర్యావరణానికి హాని కలగకుండా మితంగా వాడేందుకు అనుమతిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అక్టోబర్ 18 నుంచి 21 మధ్యనే..
ఇది తాత్కాలిక చర్య అని, అక్టోబర్ 18 నుంచి 21 మధ్యనే వాటిని కాల్చాలని తేల్చిచెప్పింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోకి బయటి నుంచి ఎలాంటి పటాకులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలు గాలి నాణ్యతా సూచీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి





