Mahaa Daily Exclusive

  ఇండియాలో నెంబర్ వన్ హైదరాబాదే… గ్లోబల్ కంపెనీలకు హైదరాబాదే కేరాఫ్…

Share

  • ఇండియాలో నెంబర్ వన్ హైదరాబాదే
  • గ్లోబల్ కంపెనీలకు హైదరాబాదే కేరాఫ్
  • 10 రోజులకు ఒక కొత్త జీసీసీ ఏర్పాటు
  • హైదరాబాద్ కు అమెరికా కంపెనీల క్యూ
  • మౌలిక సదుపాయాలకు తోడు ప్రభుత్వ మద్దతు

(హైదరాబాద్ -మహా)
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ ఇండియాలోనే నెంబర్ వన్ గా ఉంది. హైదరాబాద్ లోని జీసీసీలలో 3లక్షల మందికి పైగా ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. సగటున ఒక్క జీసీసీకి వేయిమందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్ లో పదిరోజులకో కొత్త జీసీసీ ఏర్పాటవుతుండగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,200 జీసీసీలు ఉంటే.. అందులో 1700 కేంద్రాలు భారత్‌లోనే ఏర్పాటయ్యాయి. జీసీసీలలో హైదరాబాద్ వాటా 40 శాతం కాగా, తర్వాత స్థానంలో బెంగుళూరు 33శాతం తో ఉంది. అమెరికా కంపెనీలు ప్రధానంగా హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే వ్యయాలు తక్కువ కావడం, సాంకేతికత సహా సాంకేతికేత పారిశ్రామిక రంగాలు విస్తరించి ఉండటం, నిపుణులు అందుబాటులో ఉండడం, వాతావరణం హైదరాబాద్‌కు ప్రధాన సానుకూలతలుగా మారినట్లు ఎక్స్‌ఫీనో నివేదిక పేర్కొంది. భాగ్యనగరంలోని హైటెక్‌సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి, మదాపూర్ ప్రాంతాల్లో జీసీసీలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో జీసీసీ కేంద్రాలకు హైదరాబాద్‌ హబ్​గా మారి తెలంగాణ రాష్ట్రం వన్​ ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ చేరుకునేందుకు దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా కంపెనీల ఆసక్తి హైదరాబాద్‌

హైదరాబాద్ నగరంలో ప్రతి 10 రోజులకు ఒక కొత్త జీసీసీ ఏర్పాటు అవుతోందని ఎక్స్‌ఫీనో వెల్లడించింది. అమెరికా కంపెనీలు అధికంగా హైదరాబాద్‌లో తమ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. వేగంగా ఎదగడానికి ఉన్న అవకాశాలు, నాయకత్వ అనుభవం, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను బహుళ జాతి కంపెనీలు పరిశీలించి హైదరాబాద్‌లో జీసీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని వివరించింది. మౌలిక సదుపాయాలకు తోడు ప్రభుత్వ మద్దతు కూడా ఇందుకు ఉపకరిస్తోందని విశ్లేషించింది.

హైదరాబాద్ ఫస్ట్.. తర్వాత గెంగుళూరు

ఈ నివేదిక ప్రకారం గత మూడేళ్లలో దేశంలో ఏర్పాటైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 40% హైదరాబాద్‌కు, బెంగళూరుకు 33% వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని 360 జీసీసీల్లో 3.1 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఇది తెలంగాణలోని నైపుణ్య ఉద్యోగాల్లో 14% వాటా కలిగి ఉంది. జీసీసీ ఉద్యోగుల్లో 33% మంది మహిళలే ఉండగా అందులోనూ నాయకత్వ స్థానాల్లో 19%మంది ఉన్నారు. రాష్ట్రంలో 47.8 లక్షల మంది సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉన్నారు. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్ కు అనేక అనుకూతలు ఉన్నాయని ప్రధానంగా ఖర్చు తక్కువ, నిపుణుల లభ్యత, వాతావరణ పారిశ్రామిక పరిస్థితులు కారణాలుగా ఎక్స్‌ఫీనో నివేదిక పేర్కొంది.

జీసీసీ అంటే..

అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఉప కార్యాలయాలనే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు అంటారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్‌ సేవలను అందించేందుకు నైపుణ్యంతోపాటు, చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఐటీ, ఆర్‌ అండ్‌ డీ, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్, వినియోగదారుల మద్దతు వంటి బహుళ సేవలను అందించే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాయి. ఇందుకు భారీస్థాయిలో ఏఐ, జెన్‌ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, బ్లాక్‌చైన్, ఐవోటీ, క్లౌడ్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వినియోగాన్ని పెంచుతున్నాయి.
ఎక్స్ ఫినో సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,200 జీసీసీలు ఉన్నాయి. వీటిలో 53% అంటే 1700 కేంద్రాలు భారత్‌లోనే ఏర్పాటయ్యాయి. 2028 నాటికి దేశంలో జీసీసీల సంఖ్య 2100కు పెరుగుతుందని రిపోర్టు అంచనా వేసింది. బెంగళూరు, భాగ్యనగరం తర్వాత చెన్నై, ఢిల్లీ, ముంబయి, పుణె వంటి నగరాల్లో జీసీసీలు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఐటీ, ఫార్మా దిగ్గజ కంపెనీలన్నీ

హైదరాబాద్‌లో వందలాది జీసీసీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో జీవ శాస్త్రాలు, ఫార్మా రంగానికి చెందిన బహుళ జాతి కంపెనీల కేంద్రాలు ఉన్నాయి. ప్రముఖ 10 ఫార్మా కంపెనీల్లో 8 సంస్థల జీసీసీలు భాగ్యనగరంలోనే ఉండటం విశేషం. ఇవే కాకుండా హెల్త్‌కేర్‌ సేవల సంస్థ అయిన ఎవర్‌నార్త్, ప్రపంచంలోని అతిపెద్ద యానిమల్‌ హెల్త్‌ కంపెనీ అయిన జోటిస్‌ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, డెల్ టెక్నాలజీస్‌, అమెజాన్, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి అనేక సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ బీమా సంస్థల కేంద్రాలు భాగ్యనగరంలో ఉన్నాయి. వీటితో పాటు హెల్త్ కేర్‌ అండ్ లైఫ్‌ సైన్స్, ఆటోమేటివ్‌ అండ్‌ ఏరోస్పేస్‌, ఈ-కామర్స్‌ తదితర రంగాలకు చెందిన జీసీసీ కేంద్రాలు హైదరాబాద్‌లో కొలువు దీరాయి.

Latest