- మాతృభాష పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి
- పాలన, న్యాయ వ్యవహారాల్లో మాతృభాషనే వినియోగించాలి
- ఇంట్లో అమ్మ భాష మాట్లాడుకోవాలి
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- జానమద్ది హనుమచ్చాస్త్రి శత జయంతి సందర్భంగా పురస్కారాల ప్రధానం
కడప, మహా : మాతృభాష పరిరక్షణ కేవలం పుస్తకాలు రాయడం, అవార్డులు ఇవ్వడం లేదా కార్యక్రమాలు నిర్వహించడంతోనే సాధ్యం కాదని, అది ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. బ్రౌన్ శాస్త్రిగా సుపరిచితులైన దివంగత డా. జానమద్ది హనుమచ్చాస్త్రి శతజయంతి సందర్భంగా కడపలోని సీ.పీ.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన జానమద్ది స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. మాతృభాష పరిరక్షణ అంటే భావితరాలకు అమ్మభాషలోని మాధుర్యాన్ని అందించడమేనని స్పష్టం చేశారు. ఇందుకోసం తెలుగు భాషా ప్రేమికులు, సాహితీ వేత్తలు అందరూ పిల్లలకు సులభంగా తెలుగు నేర్పించే సృజనాత్మక పద్ధతుల్ని అన్వేషించాలని పిలుపునిచ్చారు. మాతృభాషకు సేవలు అందించిన వారికి పురస్కారాలను అందించడం ఆనందంగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ ముందుగా మనదైన అమ్మ భాషను ప్రేమించి, పట్టు సాధించాలన్నారు. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక విద్య మాతృభాషలో అందించడం, పరిపాలనా భాషగా ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థానాల కార్యకలాపాలు మాతృభాషలోనే సాగడం, ఉన్నత విద్యలో స్వదేశీ భాషల వినియోగం పెంచడం, ఇళ్లలో కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడటం అనే ఐదు అంశాలపై దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు.
తెలుగు వాడు కాకపోయినా తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ స్మృతికి నివాళులు అర్పించారు. జానమద్ది హనుమచ్చాస్త్రి చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైనదని కొనియాడారు. వారసత్వం అంటే కేవలం ఆస్తులు లేదా పదవులు కాదని, ఇలాంటి మంచి కార్యక్రమాల్ని చేపట్టడమే నిజమైన వారసత్వమని పేర్కొన్నారు. గ్రంథాలయ నిర్వహణలో ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారంటూ జానమద్ది హనుమచ్చాస్త్రి కుమారుడు జానమద్ది విజయభాస్కర్ ను అభినందించారు. “మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరకు మన తిట్టు సహా సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉంది” అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నాటక రంగానికి సేవలు అందించిన డా. గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, సాహిత్యవేత్త రేవూరు అనంత పద్మనాభ రావు, 20 లక్షల పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న అంకే గౌడకి పురస్కారాలు ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఊరిలో గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం (స్వచ్ఛంద సేవా సంస్థ) ఏర్పడాలన్నది తన ఆకాంక్ష అని, ప్రజలు ఈ దిశగా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప (న్యాయమూర్తి), ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి (సాహితీవేత్త), డా. శ్రీధర్ చెరుకూరి (జిల్లా కలెక్టర్), శివశంకర్ (ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ), ఆచార్య బెల్లంకొండ శివశంకర్ (ఉపకులపతి, యోగివేమన విశ్వవిద్యాలయం), జానమద్ది విజయభాస్కర్ (సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ), పట్టణ ప్రముఖులు, జానమద్ది కుటుంబ సభ్యులు, భాషా ప్రేమికులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు






