Mahaa Daily Exclusive

  వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు: రేగా కాంతరావు

Share

  • మణుగూరులో ఉద్రిక్తత
  • బీఆర్ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడి
  • ఫ్లెక్సీలు చించి, ఫర్నీచర్‌ను తగలబెట్టిన వైనం
  • ప్రభుత్వ స్థలంలో కార్యాలయం నిర్మించాలని కాంగ్రెస్ నేతల ఆరోపణ
  • వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు: రేగా కాంతరావు
  • రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ ఫైర్

మణుగూరు, మహా: మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడికి పాల్పడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులు ఫర్నిచర్‌ను దగ్దం చేశారు. ఫ్లెక్సీలు చించి వేశారు. ప్రభుత్వ స్థలంలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిని అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. అటు తమ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అక్కడే మోహరించి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

భౌతిక దాడులు పిరికి పందల చర్య..
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పట్టణంలో జరిగిన బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తూ పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. భౌతిక దాడులకు భయపడేది లేదని.. ఎంత రెచ్చకోడితే అంత ఎక్కువ ప్రశ్నిస్తామన్నారు. ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన అయ్యేదేంటని.. కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఎవరులేని సమయాన భౌతిక దాడులు చేయడం సిగ్గుపడాల్సిన చర్య అని పేర్కొన్నారు. భౌతిక దాడులు పిరికి పందల చర్య అని మండిపడ్డారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని.. భవిష్యత్ తమదేనన్నారు. మణుగూరు పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ప్రతిచోటా రౌడీల రాజ్యం..
మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. సంఘటన సమాచారం తెలుసుకుని జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు తో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకుని గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.