- అసెంబ్లీకి రాని కేసీఆర్..రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు
- మొదటి టర్మ్ లో కాళేశ్వరం పేరిట దోపిడీ రెండో టర్మ్ లో ధరణి పేరిట దోపిడి
- కల్వకుంట్ల కుటుంబంలో దోచుకున్న సొమ్ము పంచుకునే వాటాల పంచాయతీ నడుస్తుంది
- రహమత్ నగర్ డివిజన్ ఇంటింటి ప్రచారంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అంటే సంక్షేమం,అభివృద్ది అని, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి అన్నారు. బస్తీల్లో పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాలనీ, స్థానికంగా ఉన్న సమస్యలు అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పేరుకు పోయిన సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు దక్కిన గొప్ప అవకాశమన్నారు. ఒరిజినల్ సర్వేలు అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాయనీ, దీంతో బిఆర్ఎస్ నేతలు పూర్తి నైరాశ్యంతో మాట్లాడుతున్నారని,వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందనీ మంత్రి పునరుద్ఘాటించారు..ఇవాళ లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వచ్చేలా అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అన్నారు. విశ్వ నగరంగా తీర్చి దిద్దేందుకు కాంగ్రెస్ హయాంలోనే ఎనలేని కృషి చేశామని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,ఔటర్ రింగ్ రోడ్డు,ఫార్మా,ఐటీ రంగాలకు ప్రోత్సాహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్షణ రంగానికి కూడా హైదరాబాద్ కీలక స్థావరం అన్నారు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. బిఆర్ఎస్ నేతలు ఏమైనా అంటే ఫ్లై ఓవర్లు నిర్మించామని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14కి.మీ ఒక్క పి.వి ఎక్స్ ప్రెస్ వే ఫ్లై ఓవర్..50 ఫ్లై ఓవర్లతో సమానమన్నారు. బిఆర్ఎస్ నిర్మించిన చిన్న చిన్న ఏడు,ఎనిమిది ఫ్లై ఓవర్లకు పెద్ద ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ కు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే..లక్ష కోట్ల విలువ గల ఓఆర్ార్ ను ఎన్నికల ముందు 7వేల కోట్లకు బిఆర్ఎస్ అమ్ముకున్నదనీ మండిపడ్డారు.
అసెంబ్లీకే రాని కేసీఆర్..రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు:
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమిని ముందే అంగీకరించి సెంటిమెంట్ కు,అబద్ధపు ప్రచారాలకు బిఆర్ఎస్ పార్టీ తెరలేపిందని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై వ్యక్తిగత విమర్శలు పాల్పడుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది 5 సంవత్సరాల కోసం మేము వచ్చి రెండేళ్ళు కూడా ఇంకా కాలే..ఇంకా 3ఏళ్ల సమయం ఉన్నది. అయినా కేటీఆర్ 2ఏళ్లలో కేసీఆర్ వస్తాడు అని చెప్తున్నాడు.అసెంబ్లీకి రాని కేసీఆర్..రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు. ఈ 3ఏళ్లు.. వచ్చే 5ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నే అధికారంలో ఉంటుందని” మంత్రి కోమటి రెడ్డి తేల్చి చెప్పారు






