- జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వేళ
- బీఆర్ఎస్ నేతల ఇళ్ళపై పోలీసుల దాడులు
- ఒకేసారి మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి, ఎంఎల్సీ రవీందర్ రావు ఇళ్ళలో తనిఖీలు
- పోలీసుల తీరును తప్పుపట్టిన గులాబీ నేతలు
- నాలుగు గంటల సోదాల అనంతరం వెను తిరిగిన అధికారులు
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం జోరందుకున్న నేపధ్యంలో శుక్రవారం భారీ సంచలనం చోటు చేసుకుంది. ఓటర్లకు పంపిణీ చేయటానికి బీఆర్ఎస్ నేతల ఇళ్ళల్లో డబ్బులను భారీ మొత్తాల్లో నిల్వచేసుకున్నారన్న అనుమానాలతో పోలీసులు సోదాలు చేశారు. కారుపార్టీ ఎంఎల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి ఇళ్ళపై పోలీసులు ఏకకాలంలో దాడులుచేసి సోదాలు జరపటం కలకలం రేకెత్తించింది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఈనెల 11వ తేదీన జరగబోతున్న విషయం తెలిసిందే. పోలింగ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయటానికి పార్టీలు డబ్బులు రెడీచేసుకుంటున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. నేతలు కూడా ఎవరికి వారు ఎదుటి పార్టీ డబ్బులు పంచుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై పార్టీలు ఒకదానిపై మరొకటి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఉదయం ఒకేసారి బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి, ఎంఎల్సీ రవీందర్ రావు ఇళ్ళపై ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. మోతీనగర్ లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి ఇంటిపైన, కూకట్ పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న రవీందర్ ఇళ్ళల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. దీనిపై ఇద్దరు నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులే డబ్బులున్న బ్యాగులను తనింట్లోకి తీసుకెళ్ళినట్లు మర్రి ఆరోపించారు. తనింట్లో డబ్బుసంచలు లేకపోయినా పోలీసులే పెట్టి తనవిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతను డైవర్ట్ చేయటానికి సోదాల డ్రామాలాడుతున్నట్లు రెచ్చిపోయారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇంతటి రౌడీయిజానికి పాల్పడుతుందని అనుకోలేదని మర్రి అన్నారు. ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసి ఇలాంటి నాటకాలు ఆడటం మంచిదికాదన్నారు.
ఇదేసమయంలో బీఎస్పీ కాలనీలో ఉంటున్న తక్కెళ్ళపల్లి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. . ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో ఉన్న తనింట్లో పోలీసులు ఎలా సోదాలు చేస్తారని రవీందర్ పోలీసులపై ఫైర్ అయ్యారు. అయితే పోలీసులు రవీందర్ అభ్యంతరాలను లెక్కచేయలేదు. తమ నేతల ఇళ్ళల్లో సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమను పోలీసులు బెదిరిస్తున్నారని, సోదాలపేరుతో వేధిస్తున్నారంటు కారు పార్టీ నేతలు గోలచేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటు మండిపడుతున్నారు. ఇద్దరు నేతల ఇళ్ళల్లో సోదాల అనంతరం పోలీసులు వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. రెండిళ్ళలో ఎలాంటి నోట్ల కట్టలు దొరకక పోవడం కొసమెరువు






