Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి అయ్య జాగీరా? ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తా అంటావా?:మంత్రి హరీశ్ రావు

Share

  • రేవంత్ రెడ్డి అయ్య జాగీరా?
  • ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తా అంటావా?
  • సీఎం రేవంత్ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా
  • మేము ప్రశ్నించడం వల్లే మంత్రులు గల్లీల్లో పరుగులు పెడుతున్నారు
  • మీట్‌ ది ప్రెస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు. అది ప్రభుత్వం బాధ్యత అని, రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది.. అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో మూడేండ్లు రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాలన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం, రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని, వీధి దీపాలు లేవని, కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం నాశనం అయిందని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిపిస్తే 6 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, రూ.23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తామని, డిఫెన్స్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని.. ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని, తాము లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ ఉండదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ముస్లింలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి..
ముస్లింలు స్వాతంత్య్రం కోసం యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే నేడు కాంగ్రెస్ మంత్రులు గల్లీల్లో పరుగులు పెడుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఆయన మరణానికి కారణం అయిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్‌ రెడ్డికి ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తుకువస్తున్నారని చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలని సోయి వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ప్రధాని చెప్పిన త్రిబుల్‌ ట్యాక్సపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలసి బీసీలను మోసం‌ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు? అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుంటేముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ అన్యాయమని.. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌ చేశారు

Latest