హైదరాబాద్, మహా : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆట మొదలైనప్పుడు తానేంటో చూపిస్తానని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. శనివారం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల కాళ్ల క్రింద ఉన్న భూమి కదలాలన్నారు. తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకున్నది కెసీఆర్ కాళ్ల క్రింద తెలంగాణ ఉండటానికి కాదన్నారు. బలిదానాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగాయన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్ పెత్తనం చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రెక్కాడితే డొక్కాడని ప్రజల కోసం బీజేపీ పోరాడుతోందన్నారు. పేదల గూడు కూల్చితే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటే ప్రజలు ఇపుడు బీజేపీ పక్షాన నిలవాలన్నారు. ఘనమైన బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా తీయించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రానుందని, దీనికి జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో విజయం నాంది పలుకనుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






