- రేవంత్, బీజేపీది ఫెవికాల్ బంధం
- పొంగులేటి మీద రైడ్స్ జరిగితే సప్పుడు లేదు
- ఢిల్లీలో భట్టి ఇంట్లో రైడ్స్ జరిగితే ఎందుకు బయటపడ్లే?
- బీజేపీతో ఢిల్లీలో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు బయటపడ్డాయి
- ఆయన ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది తెలుసు
- మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారంటీల గురించి మాట్లాడి ప్రజలకు ఓట్లు అడగాలన్నారు. తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందని డీజీపీ చెప్పారన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లకు జీతాలు, రోగులకు మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకొవడంలేదన్నారు. టీఎస్‌ఐపాస్ అధికారిక వెబ్ సైట్లో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రూ.20,192 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని అబద్ధాలు చెప్తున్నాడని ఏకీపారేశారు. ఆనాడు మా పాలనలో కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడితే.. ఈనాడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కాలేజీలకు బకాయిలు పెట్టిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ రెండేళ్ల నుండి పెండింగ్ పెడితే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం బ్రతిమలాడారన్నారు. చివరికి సమ్మె చేస్తామని అంటే వాళ్ల మీద రేవంత్ రెడ్డి గుండాగిరికి దిగాడన్నారు.
బైటికి రాకుండా ఎందుకు తొక్కి పెట్టారు..
మా బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చినా కష్టమొచ్చినా రూ.20508 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ చెల్లించిందని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. 2014-15లో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రూ.62 వేల కోట్లు ఉంటే.. అదే 2023లో రూ.2.30 లక్షల కోట్లుగా పెరిగిందన్నారు. మా హయంలో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూను 4 రెట్లు పెంచామన్నారు. ఆ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా మహమ్మారి వచ్చిని కూడా తెలంగాణను ప్రగతి పథంలో తీసుకెళ్లామన్నారు. మేము 10 ఏళ్లలో 4 రేట్లు పెంచితే, రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మైనస్ చేశాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగితే, ఆ వార్త బైటికి రాకుండా ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నలు గుప్పించారు. గుర్గావ్ లోని భట్టి విక్రమార్క అత్త గారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగి, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్తే ఎక్కడా ఒక్క వార్త కూడా లేదు ఎందుకు రాలేదన్నారు. పొంగులేటి మీద ఈడీ రైడ్స్ జరిగితే కూడా సప్పుడు లేదన్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని క్లియర్ గా అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అదే విధంగా.. రేవంత్ రెడ్డిది నోరా మోరా?. ఏది పడితే అది మాట్లాడుతున్నారని హరీశ్ రావు అంటూ మండిపడ్డారు






