- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
- కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
- 42 టేబుల్స్, 10 రౌండ్లలో జరుగనున్న కౌంటింగ్
- మీడియా సమావేశంలో కర్ణన్
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) పర్యవేక్షణలో అధికారులు చకచక ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన పోలింగ్ అనంతరం అన్ని ఈవీఎంలను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. కౌంటింగ్ రోజున అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కింపు ప్రారంభించనున్నారు. కాగా మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుల్లు ఏర్పాటు చేయగా 10 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు లెక్కింపులో పాల్గొంటారని, కౌంటింగ్‌కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామని ఎన్నికల అధికారి ఆర్ వీ కర్ణన్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక ఫలితాలను వెంటనే ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.
కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్, సీఐఎస్‌ఎఫ్, స్పెషల్ బ్రాంచ్ బలగాలను మోహరించారన్నారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు ఒక్కటి కూడా రాలేదు కాబట్టి ముందుగా హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నామన్నారు. హోం ఓటింగ్ కోసం 103 మంది అప్లై చేయగా, 101 మంది ఓటు వేశారని, ఇద్దరు ఓటర్లు మరణించారని తెలిపారు. హోం ఓటింగ్ తర్వాత షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది, అందులో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది కాగా వీరిలో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ప్రకటించారు. వారిలో పురుషులు 99,771, మహిళలు 94,855, ఇతరులు 5 మంది ఉన్నారు. దాంతో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఈ సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తక్కువేనని వివరించారు.
భద్రత కట్టుదిట్టం
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. భద్రత కోసం15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ కే అనుకూలమంటున్న సర్వే సంస్థలు
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆరా మస్తాన్, పబ్లిక్ పల్స్ సహా పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టింది. ఆరా సర్వే కాంగ్రెస్ కు 47.49 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ కు 39.25 శాతం ఓట్లు వస్తాయని.. బీజేపీకు 9.31 శాతం ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. పబ్లిక్ సర్వే 48.5 శాతం ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ కు 41.8 శాతం ఓటర్.. బీజేపీకు 6.5 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది. మిగతా వారికి 3.2 శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. వీటితో పాటు దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపాయి. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మృతి కారణంగా ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ బై పోల్ లో బీఆర్ఎస్పార్టీ తరఫున మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో దిగారు. అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేశారు. వీరితోపాటుగా ఈ ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీరి భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తెలనుంది.






