- బస్సులు పెంచండి
- ఆర్టీసీ సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశం
- ఆదాయ పెంపుపై అవకాశాలు అన్వేషించాలని సూచన
- నగర విస్తీర్ణానికి అనుగుణంగా బస్సు రూట్ లు పెంచాలని ఆదేశం
- కారుణ్య నియామకాల ప్రొవిజన్ పిరియడ్ ను 2 సంవత్సరాలకు తగ్గించాలని ఆదేశం
- నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్, మహా : మహాలక్ష్మీ పథకం అమలు తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ఫలితంగా ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 7980 కోట్లను చెల్లించిందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. టికెట్ ఆదాయంతో పాటు టికటేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో టిమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్ సుఖ్ నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదిక ను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయని, త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలని సూచించారు.
ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్వ్యూ దశలో ఉండడంతో నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, 114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడు సంవత్సరాల ప్రొవిజన్ రెండు సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
మేడారం జాతర లోపల ములుగు డిపో పూర్తి కావాలి
మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ లోపు స్లాబ్ పనులు పూర్తి చేయాలని జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, పెద్దపల్లి జిల్లా బస్సు డిపో పనుల పురోగతిపై ీ సందర్భంగా మంత్రి అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. పుష్కరాల లోపు మంథని బస్ స్టేషన్ ఆధునీకరణ పూర్తి కావాలని ఆదేశించారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని, హుజూర్ నగర్, కోదాడ బస్ స్టేషన్ ల శంకుస్థాపన వారం రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మిర్యాలగూడ అప్ గ్రేడేషన్ పనులు ప్రారంభించాలని తెలిపారు.
ఫోర్త్ సిటీలో బస్ స్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ నిర్మాణం , బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని తెలిపారు. నగరంలో నలువైపుల బస్ స్టేషన్ లు ఉండేలా జెబిఎస్ మాదిరి ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ ,పోలీస్ శాఖ కి సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉప్పల్ లో మరో బస్ టెర్మినల్ నిర్మించడానికి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపో లో చాలా కాలంగా పేరుకు పోవడంతో వారికి సమయం ఇచ్చి యాక్షన్ వేయాలని సూచించారు. ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి , రాజధాని , గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం ను పని తీరును అడిగి తెలుసుకున్నారు . దీని ద్వారా డ్రైవర్ నిద్ర ఉపక్రమించే సూచనలు కానీ ,మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. ఇక ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ లకు నిరంతరం శిక్షణ ప్రతి బస్సు కి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలని పేర్కొన్నారు. డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇది విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. తార్నాక హాస్పిటల్ లో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేస్తున్న డార్మిటరీ రూంను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ ఫంక్షన్ హాల్ లు వస్తున్న ఆదాయం ఖర్చులు వివరాల పై ఆరా తీశారు. దీని ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల ద్వారా మరో 450 బస్సుల సేకరణ
ఆర్టీసీ మహిళా సంఘాలు ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుంది . ఇప్పటి వరకు 150 బస్సులు మహిళా సంఘాలు ఆర్టీసీ తో సంయుక్తంగా నడుస్తున్నాయి. మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్‌లో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్టీసీలో 1000 డ్రైవర్లు,743 శ్రామిక్ పోస్టులకు నోటిషికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ దశలో ఉన్నాయని మంత్రి పొన్నం తెలిపారు. ఈ నియామకాలు వేగంగా, పారదర్శకంగా జరిగేలా చూస్తామన్నారు. అలానే వచ్చే నెల అనగా డిసెంబర్ చివరి నాటికి మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు.







