- నవీన్ యాదవ్ కు మంత్రి?
- పునర్వ్యవస్థీకరణలో లక్కీ ఛాన్స్
హైదరాబాద్, మహా
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మక సవాలుగా మారిన ఈ ఎన్నికలో.. నవీన్ యాదవ్ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రభుత్వానికి భారీ ఊపునిచ్చింది. ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి, మొత్తం కాంగ్రెస్ కేబినెట్ ఒకవైపు, బీఆర్ఎస్ అధినాయకత్వం మరోవైపు నిలబడి హోరాహోరీగా పోరాడాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎన్నికలో గెలిచినందున.. నవీన్ యాదవ్కు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ నినాదాన్ని బలంగా వినిపించింది. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతోనే కుల గణన చేపట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టడానికి ప్రయత్నించినా.. కోర్టుల అడ్డంకులు, కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అందుకే.. బీసీలకు కేబినెట్లో మరిన్ని స్థానాలు కల్పించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు లేదా ముగ్గురు బీసీ నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని నవీన్ యాదవ్ అందిపుచ్చుకున్నా ఆశ్చర్యంలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.





