Mahaa Daily Exclusive

  సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్ … 17న నిర్ణయం.. వారంలో షెడ్యూల్ …

Share

హైదరాబాద్, మహా :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని ఉత్సాహాన్ని, రాజకీయంగా కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ గెలుపును పునాదిగా చేసుకుని.. ప్రభుత్వం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికలను ఒక సువర్ణావకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ (వెనుకబడిన తరగతుల) రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలుగా మారింది. గతంలో ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన (లీగల్) సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో.. అధికారులు మరో నివేదికను సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదు. ఈ న్యాయపరమైన పరిమితిని దృష్టిలో ఉంచుకుని.. మొత్తం 50 శాతం పరిమితిలోనే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించేలా అధికారులు మార్గాలను అన్వేషించారు. దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. బీసీ సంఘాల నేతలతో కూడా మంత్రులు మాట్లాడే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారంలో లేదా తదుపరి నెల మొదటి వారంలోగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఎన్నికలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త స్థానిక నాయకత్వాన్ని అందించి, పార్టీ బేస్ ను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Latest