- అటవీ పరిరక్షణకు వెనకడుగు వేయొద్దు
- ఫారెస్టుల్లో ఫైర్స్ తగ్గించేందుకు స్థానికులకు శిక్షణ ఇవ్వాలి
- అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
- తెలంగాణ హరిత నిధి’పై రాష్ట్ర స్థాయి సమావేశం
హైదరాబాద్, మహా: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫారెస్టుల్లో ఫైర్స్ తగ్గించేందుకు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. అటవీ పరిరక్షణకు ఏ చర్యకైనా వెనకడుగు వేయొద్దని ఫారెస్టు ఉన్నతాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు, ఎకో టూరిజం డెవలప్ చేసి ఫారెనర్స్ ని కూడా ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన విషయలో అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో కూడా సంయుక్తంగా ఒక మీటింగు పెట్టేందుకై ఏర్పాట్లకు ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. శనివారం సచివాలయంలోని మంత్రి పేషీలో ‘తెలంగాణ హరిత నిధి’ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో హరితనిధి వినియోగంపై సమగ్ర చర్చ చేశారు. నర్సరీలను ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు మంత్రి సురేఖ ప్రత్యేక సూచనలు చేశారు.
శాస్త్రీయంగా ముందుకు వెళ్ళేందుకు చర్యలు..
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా చర్చ చేశారు. దాంతోపాటు, అడవుల్లో ఫైర్స్ కంట్రోల్ చేయడం అనివార్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. దాని ద్వారా అటవీ సంపద, జంతువుల పరిరక్షణ చేపట్టినట్టు అవుతుందన్నారు. 2025-26 బడ్జెట్ మీద మంత్రి శాంక్షన్లపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఫైర్స్ మీద కూడా సమావేశంలో చర్చ జరగ్గా… వాటిని తగ్గించేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలపై మంత్రి ఆరా తీశారు. వీటిపై రానున్న రోజుల్లో మరింత శాస్త్రీయంగా ముందుకు వెళ్ళేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ , పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణ, సునీత భగవత్, సీసీఎఫ్ డాక్టర్ జి. రామలింగం(సోషల్ ఫారెస్టు), డాక్టర్ బీమా నాయక్, ప్రియాంక వర్గీస్, అన్ని జిల్లాల డీఎఫ్ఓలు, ఆర్థికశాఖ, ఇతరశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







