- సీఎం రేవంత్.. భేష్
- ముఖ్యమంత్రి మార్క్ స్ట్రాటజీ ప్లే పట్ల హైకమాండ్ ప్రశంసలు
- ఉప ఎన్నిక గెలుపులో రేవంత్ కీ రోల్ పట్ల ఖర్గే, రాహుల్ కితాబ్
- ఇదే మార్క్ లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించాలని సూచన
- కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్, నవీన్ భేటీ
- నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌ను నేతల అభినందనలు
- ఎన్నికల్లో చోటు చేసుకున్న అంశాలు, పార్టీ గెలుపు అంశాలు వారికి వివరణ
ఢిల్లీ, మహా: జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ ప్లే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేలు శభాష్ అని మెచ్చుకున్నారు. జూబ్లిహిల్స్‌లో ఎన్నికల్లో విజయం సాధించడంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేతలు, నవీన్ యాదవ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయం.. ఎన్నికల్లో చోటు చేసుకున్న అంశాలు, పార్టీ గెలుపు అంశాలను ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీ.. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా రాహుల్ గాంధీ, ఖర్గేలు.. . లోకల్ బాడీఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో సీఎం రేవంత్ రెడ్డితో సమాలోచనలు జరిపారు.
అన్నీంటిలో సీఎం రేవంత్ తనదైన మార్క్
ఇక పార్టీ ప్రచార బాధ్యతలను డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఆయనే దగ్గరుండి సమన్వయం చేయడం హైకమాండ్ ప్రశంసించింది. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపడం పట్ల కితాబ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రెండేళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టి భేష్ అనిపించుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా స్పందిచవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను రాబట్టుకోవడం తనదైన మార్క్ కనిపించారు. అదే తీరును లోకల్ బాడీ ఎన్నికల్లోనూ చూపించాలని సూచించారు. ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇక టీడీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ వైపే మెుగ్గు చూపాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ముందే గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపారు.







