- మరో 15
- ఏళ్లు అధికారం కాంగ్రెస్‌దే
- ప్రతి సింగల్ రోడ్డును డబల్ రోడ్డు చేస్తాం
- బీఆర్ఎస్ నాలుగు ముక్కలు.. బీజేపీకి డిపాజిట్ దక్కట్లేదు: మంత్రి కోమటిరెడ్డి
- పదేళ్లలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- అన్ని వర్గాల మేలు కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని వెల్లడి
- మిర్యాలగూడలో రూ.180.25 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన
నల్గొండ, మహా: మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును, డబుల్ రోడ్డుగా చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. రూ.180.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రులు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కాలేజీని.. ప్రభుత్వ కాలేజీగా మార్చింది తామేనని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా రూ.60 వేల కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశామని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం ఇస్తోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొనుగోలు చేసి, ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లోపే నిధులు జమ చేస్తున్నామని, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసినట్టు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని వెల్లడించారు. మిర్యాలగూడ మెయిన్ కెనాల్ లైనింగ్‌కు 57 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. దుబ్బ తండా, శాంతినగర్, రావులపెంట చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలు, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.






