Mahaa Daily Exclusive

  మావోయిస్టులారా….అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు

Share

  • మావోయిస్టులారా….అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు
  • అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారు…
  • ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు
  • మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు
  • తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవండి
  • వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంజయ్
  • వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత

వేములవాడ, మహా : అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారని, ఇచ్చిన మాట మేరకు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతారన్నారు. ‘‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి’’ అని సంజయ్ పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో 4 నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.

సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సహాకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో దేశంలోని అన్ని ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తొందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యత్నిస్తోందని తెలిపారు. చాలా ఆసుపత్రుల్లో సూదులు, మందులు, కాటన్ కూడా లేని పరిస్థితి ఉంటే…. నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆసుపత్రుల్లో పేదలకు పూర్తిగా వైద్య సేవలందించేందుకు యత్నిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ మిషన్ వంటి ముఖ్యమైన 16 వైద్య పరికరాలను అందించడం జరిగిందని, వేములవాడ ఆసుపత్రిలో మొత్తం రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ పరికరాలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఆసుపత్రులకు కూడా ఇదే స్థాయిలో వైద్య పరికరాలు అందిస్తుమన్నారు. అందుకోసం ఎన్ఎండీసీ సహకారంతో రూ. 5 కోట్ల సీఎస్సార్ నిధులను సేకరించి ఈ వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆయా ఆసుపత్రులకు అందించడం జరిగిందన్నారు.

హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ

తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని సంజయ్ అన్నారు. మేం బ్యాలెట్ ను నమ్ముకుని ముచ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాగలిగామని, మీరు తుపాకీ పట్టుకుని పోలీసులను, దళిత, గిరిజనులను చంపడం, మీరూ చనిపోవడం మినహా మీరు సాధించిందేమిటి? అని అన్నారు. దేశంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వం కాదని, మోదీ ప్రభుత్వమని, దేశ సరిహద్దులో జవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలన్నారు. మావోయిస్టులు తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాల్సిందేనని అన్నారు. మావోయిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యమని, మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా అవకాశమిచ్చినా వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తుపాకీతో సాధించేదేమిటి? తుపాకీ పట్టుకుంటే క్షమించే ప్రసక్తే లేదన్నారు. కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు పట్టి అడవుల్లోకి పంపితే… తిండి తిప్పలు లేక తిరుగుతున్నారన్నారు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మావోయిస్టులకు 4 నెలలు మాత్రమే సమయం ఉందని, 2026 మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యమని పునరుద్ఘాటించారు. అర్బన్ నక్సల్స్ మాయలో పడి ప్రాణాలు తీసుకోవద్దన్నారు. అర్బన్ నక్సల్స్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పైరవీలు చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ కార్లలో తిరుగుతున్నారన్నారు. మీరు మాత్రం అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తుపాకీ పట్టుకుని తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండన్నారు.
తుపాకీ పట్టుకుని చర్చలు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని, తుపాకీ వీడాల్సిందే జన జీవన స్రవంతిలో కలవాల్సిందేనని అన్నారు. తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదని, బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోండన్నారు.

Latest