హైదరాబాద్, మహా : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లేనని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించిన ఘటనపై ప్రొ. హరగోపాల్ స్పందించారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపోర్ట్ లేక పోవడం కూడా ఒక కారణమన్నారు. మావోయిస్టుల్లో చీలికలు, విభేదాలు, అభిప్రాయ బేధాలు వలన మావోయిస్టు పార్టీ క్షీణించిందని చెప్పారు. కేంద్ర కమిటీ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాన్నాయని ఆయన విశ్లేషించారు. మూడు రాష్ట్రాల పోలీసులతోపాటు, కేంద్ర ప్రభుత్వం సైతం హిడ్మాపై ఫోకస్ పెట్టిందన్నారు. హిడ్మా అనే వ్యక్తి మావోయిస్టు పార్టీలో చాలా బలమైన నాయకుడని అభివర్ణించారు. పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి హిడ్మా అని ప్రొ.హరగోపాల్ స్పష్టం చేశారు.
ఏదైనా లక్ష్యం నిర్దేశిస్తే పూర్తి చేయగలడనే ఒక బలమైన నమ్మకం హిడ్మాపై పార్టీలో బలంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు టెక్నాలజీ, ఆయుధాలు, డ్రోన్లతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయన్నారు. వాటిని మావోయిస్టు పార్టీ తట్టుకోలేక పోయిందని వివరించారు. 25 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో లేవని అలాగే ప్రజల నుంచీ ఆశించిన స్థాయిలో వారికి మద్దతు లేదని చెప్పారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు.






