Mahaa Daily Exclusive

  బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలి: భట్టి

Share

  • తెలంగాణ రైజింగ్‌తో భవిష్యత్తు రోడ్‌మ్యాప్
  • రైజింగ్ ఉత్సవాల్లో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తాం
  • బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలి: భట్టి
  • బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్, మహా: వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని, ఈ భారీ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్‌గా 2047 రోడ్ మ్యాప్‌ను విడుదల చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించాం, రెండవ సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం పట్ల మా కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నాం అనేది తెలంగాణ రైసింగ్ ఉత్సవంలో వివరించబోతున్నామని తెలిపారు.

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునర్జీవనం వంటి అంశాలను వివరించి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా, వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులను ఆకర్షించినట్టు తెలిపారు. బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందన్నారు, తద్వారా జిడిపి పెరుగుతుందని తెలిపారు. ఆత్మవిశ్వాసం, సమిష్టి కర్తవ్యంతో ఒక ఆధునిక, సమగ్ర, భవిష్యత్‌ సిద్ధ తెలంగాణను నిర్మిద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.

Latest