- నాలెడ్జ్ హబ్‌గా అంబేద్కర్ యూనివర్సిటీ తీర్చిదిద్దుతాం
- విద్యా వ్యవస్థ మెరుగు మార్చాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఎంవోయూ
హైదరాబాద్, మహా: తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత మెరుగు మార్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (ఐడీఈఏ) ఏర్పాటుకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






