- ఆ ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకం
- పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి చేపడుతోంది
- ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రమంత్రిని కోరాం: మంత్రి ఉత్తమ్
- ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రితో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ, మహా: ఏపీ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని, ఆ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రమంత్రిని కోరామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామన్నారు. మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు భూ సేకరణ కోసం కర్ణాటక జీవో జారీ చేసిందన్నారు. 519 మీటర్లకంటే ఎక్కువ ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్టు స్టే ఉందని, స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన జీవోను కేంద్రజల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, తెలంగాణలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిధులివ్వాలని కోరినట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో కేఆర్‌ఎంబీ టెలీమెట్రీ స్టేషన్ పనుల్లో పురోగతి వచ్చిందన్నారు. కేఆర్‌ఎంబీ టెలీమెట్రీ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాని అడిగామని, మరో 20 టెలీమెట్రీ స్టేషన్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఫేజ్-2లో 9, ఫేజ్-3లో 11 నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గుర్తు చేశారు.






