రేవంత్ మార్క్ రాజకీయం.
*సొంత గడ్డపై ఎడ్యుకేషన్ హబ్..
*తెలంగాణ ముఖచిత్రంపై తొలి సైనిక్ పాఠశాల.
* వికారాబాద్ జిల్లాలో పీపీపీ పద్ధతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.
* 24న శంకుస్థాపనకు సర్వం సిద్ధం.
హైదరాబాద్ , మహా.
తెలంగాణ విద్యా వ్యవస్థలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశ రక్షణే ఊపిరిగా భావించే యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో మొట్టమొదటి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో, వెనుకబడిన ప్రాంతంగా పేరున్న కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు విద్యా కేంద్రంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు, గ్రామీణ విద్యార్థులకు భారత రక్షణ దళాల్లో చేరేందుకు రాజమార్గం వేయనుంది.
*జై జవాన్.. జై కొడంగల్!*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఒక పూర్తిస్థాయి సైనిక్ స్కూల్ మంజూరు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం, హకీంపేట గ్రామం ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు వేదిక కానుంది. ఇక్కడ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎడ్యుకేషన్ హబ్’లో ఈ సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సొసైటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నెల 21న ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ, ప్రతిపాదిత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలత వ్యక్తం చేయడం విశేషం. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడనుంది. ఈ బృహత్తర కార్యానికి నవంబర్ 24న అంకురార్పణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హకీంపేటలో సుమారు 11 ఎకరాల సువిశాలమైన స్థలాన్ని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ పాఠశాల నడవనుంది. నిబంధనల మేరకు భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్ని వసతులు సిద్ధమైతేనే కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తుంది. మరోవైపు, రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలను సైనిక్ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయాలంటూ విద్యాశాఖ రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇందులో రంగారెడ్డి, హనుమకొండ, యాదాద్రి జిల్లాల జడ్పీ పాఠశాలలతో పాటు మరో నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. అయితే, వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు పూర్తిగా కొత్తగా (గ్రీన్‌ఫీల్డ్) సైనిక్ స్కూల్ మంజూరు అవుతుండటంతో, అదే జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలను మార్చే ప్రతిపాదనను విరమించుకునే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోని ప్రతిపాదనలపై స్పష్టత రావాల్సి ఉంది.
*నూతన విధానంలో విప్లవాత్మక మార్పులు*
గతంలో కేవలం రెసిడెన్షియల్ విధానంలోనే నడిచే సైనిక్ స్కూళ్లలో, ఇప్పుడు డే స్కాలర్ పద్ధతికి కూడా అనుమతి లభించడం విశేషం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష లో ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సాగే ఈ విద్యాభ్యాసంలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఫీజులో సగం భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 102 పాఠశాలలు ఈ పీపీపీ మోడల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో కొడంగల్ కూడా చేరనుండటం తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.
.






