- రేపటినుంచి కూర్చీ లొల్లి ఉండదు
- సీఎం మార్పు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలే
- 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం: సీఎం సిద్ధు
- హైకమాండ్ ఏం చెప్పినా.. దాన్నే అనుసరిస్తాం: డీకే శివకుమార్
కర్ణాటక, మహా: కర్ణాటక సీఎం కుర్చీ కోసం సమరం వేళ కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు శనివారం బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు ఒక్కచోట కలిశారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. ఇకముందు కూడా ఉండబోవని స్పష్టంచేశారు. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము బ్రేక్‌ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని.. కానీ ఏ విషయం పైనా చర్చించలేదని తెలిపారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగిందన్నారు. బీజేపీ-జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తోందని సిద్ధరామయ్య దుయ్యబట్టారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తాను, డీకే ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికల పైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
హైకమాండ్ ఏం చెప్పినా..
కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నామని.. హైకమాండ్ ఏం చెప్పినా.. దానిని అందరం అనుసరిస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని.. 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్యతో జరిగిన భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశం సహా పలు విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించడంతో తాను ఎదురుచూస్తున్నానని.. ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధమేనని అన్నారు.





