సూర్యపేట,మహా.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో బిజీగా ఉండగా, రాజకీయ చైతన్యం ఊపందుకుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం యువత ఏళ్ల తరబడి శ్రమిస్తుంటే, చేతిలో ఉన్న ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కాదనుకొని ప్రజాసేవే పరమావధిగా భావించిన ఓ పోలీసు అధికారి నిర్ణయం ఇప్పుడు సూర్యపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్గా పోటీ చేసి, తన ఊరిని అభివృద్ధి పథంలో నడిపించాలనే దృఢ సంకల్పంతో ఓ ఎస్సై తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
వివరాల్లోకి వెళితే.. సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1989లో తన స్వగ్రామం నుంచే కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి ఎస్సై స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘకాలం పాటు వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన వెంకటేశ్వర్లుకు, పోలీస్ శాఖలో ఇంకా కొంతకాలం సర్వీస్ మిగిలి ఉంది. అయితే, తన సొంత ఊరైన గుడిబండ గ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలనే బలమైన కోరిక ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, సర్పంచ్గా పోటీ చేసే అవకాశం రావడంతో, ఆయన తన ఎస్సై ఉద్యోగాన్ని త్యజించి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా పులి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఎదుగుదలకు కారణమైన గ్రామానికి తాను రుణపడి ఉన్నానని, ఆ రుణం తీర్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. “మా ఊరి నుంచే ప్రస్థానం మొదలుపెట్టాను, ఇప్పుడు మా ఊరి కోసమే తిరిగి వచ్చాను. గ్రామ అభివృద్ధి కోసమే నేను ఎస్సై ఉద్యోగాన్ని వదులుకున్నాను. సర్పంచ్గా గెలిచి, నా గ్రామానికి నిస్వార్థంగా సేవ చేయడమే నా ముందున్న ఏకైక లక్ష్యం,” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం పదవి కోసం కాకుండా, జన్మభూమి రుణం తీర్చుకోవాలనే తపనతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు, సన్నిహితులు స్వాగతిస్తున్నారు.





