- కేసీఆర్ దీక్షను అవమానిస్తే ఊరుకోం
- తెలంగాణ కథలో కాంగ్రెస్ ముమ్మాటికి విలన్
- రాజీవ్ విగ్రహం తీసి తల్లి తెలంగాణ విగ్రహం పెడతాం
- దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఉద్యమం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ దీక్షను తక్కువ చేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు చరిత్రను గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ప్రాణం ముఖ్యమని దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోకూడదన్నారు. తెలంగాణ కథలో కాంగ్రెస్ ముమ్మాటికి విలన్ అని, శాశ్వత శత్రువు కాంగ్రెస్ పార్టీయే అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యమని, ఉద్యమ నాయకులను అవమానించడాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలంగాణను ప్రతిసారి ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని కేటీఆర్ ఆరోపించారు. 1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, విలన్ కాంగ్రెస్సేనని పునరుద్ఘాటించారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను పార్టీలో కలుపుకొని మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ, చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి మాదిరి తాము ఏనాడు సోనియా గాంధీని ‘తెలంగాణ బలిదేవత’ అని అనలేదని, ఇది తెలంగాణను అవమానించడమేనని అన్నారు. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతాము అని కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ దీక్ష వంటి కీలక ఘట్టాలను ప్రజలు, ఉద్యమకారులు మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లే హీరోలని ఫోజులు కొట్టి చరిత్రను వక్రీకరిస్తారని, అందుకే ప్రతి తరం తమ చరిత్రను, పోరాట కథను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని, అమరుల ప్రాణాలు తీసుకున్న తీరుని కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేస్తూనే, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఉన్న అపూర్వమైన ఘట్టాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.






