Mahaa Daily Exclusive

  ఓరుగల్లులో ఆరిన ‘సంఘ’ దీపం.

Share

  • ఓరుగల్లులో ఆరిన ‘సంఘ’ దీపం.
  • ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రేవా కోటేశ్వరరావు అస్తమయం.
  •  వరంగల్ సంఘ ప్రస్థానంలో చెరిగిపోని ముద్ర.

వరంగల్,మహా.

ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా నీడలో ఆరున్నర దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన ఓ నిస్వార్థ జీవన ప్రస్థానం ముగిసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విస్తరణే ఊపిరిగా, దేశభక్తే జీవన విధానంగా బతికిన సీనియర్ నాయకుడు రేవా కోటేశ్వరరావు (85) శనివారం శివైక్యం చెందారు. వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలుసుకున్న సంఘ్ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆరున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రా ప్రాంతం నుంచి వరంగల్‌కు వచ్చిన కోటేశ్వరరావు, ఈ మట్టి మనిషిగా మారిపోయారు. మహబూబియా హైస్కూల్లో హిందీ పండిట్‌గా విద్యాబోధన చేస్తూనే, సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో మమేకమయ్యారు. సూర్యాపేటలో ప్రచారక్‌గా మొదలైన ఆయన ప్రస్థానం, వరంగల్ జిల్లాలో సంఘ్ వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణమైంది. కార్యవాహ నుంచి ప్రాంత కార్యకారిణి సభ్యుడి వరకు ఆయన చేపట్టిన ప్రతి బాధ్యతలోనూ ఒక కార్యదక్షత కనిపించేది.
సాధారణంగా ఉద్యోగులు వారాంతపు సెలవుల్లో విశ్రాంతి కోరుకుంటారు. కానీ కోటేశ్వరరావుకి మాత్రం శనివారం బడి గంట మోగితే చాలు, గ్రామీణ పర్యటనే ఊపిరి. శనివారం సాయంత్రం బయలుదేరితే, మళ్ళీ సోమవారం ఉదయం పాఠశాల ప్రార్థన సమయానికి మాత్రమే తిరిగి వచ్చేవారు. వ్యక్తిగత సుఖాలను పక్కనపెట్టి, పల్లెపల్లెనా శాఖలను సందర్శిస్తూ, యువతలో దేశభక్తిని రగిలించిన ఆయన క్రమశిక్షణ నేటి తరం కార్యకర్తలకు ఆదర్శం.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెనకడుగు వేయలేదు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారు. అలాగే అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఆయనది కీలక పాత్ర. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సంఘటనాశీలిగా రెండు పడవల ప్రయాణాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన కోటేశ్వరరావు మృతి పట్ల ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘచాలక్ ప్రొఫెసర్ చిలకమారి సంజీవ, కార్యవాహ ప్రొఫెసర్ గద్దె రమేష్ ఘన నివాళులర్పించారు. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన తీర్చిదిద్దిన వేలాదిమంది స్వయంసేవకుల రూపంలో ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది.

Latest