Mahaa Daily Exclusive

  * కంచే చేను మేస్తే.. జింకలకు దిక్కెవరు?

Share

* కంచే చేను మేస్తే.. జింకలకు దిక్కెవరు?
* నీలాద్రి పార్కులో అధికారుల కనుసన్నల్లోనే వేట!
* విందు కోసం అమాయక జింకల బలి?
* రక్షకులే భక్షకులు.. అర్బన్ పార్కులో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకం!
* జింకల మృతిపై టాస్క్ ఫోర్స్ ఆరా.. విచారణ వేళ మీడియాకు ‘నో ఎంట్రీ’
* కుక్కల దాడిలో కొన్ని.. తుపాకీ గుళ్లకు మరికొన్ని!

ఖమ్మం బ్యూరో, మహా.

ప్రకృతి రమణీయతకు, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకగా నిలవాల్సిన అభయారణ్యం నేడు వన్యప్రాణులకు మరణశయ్యగా మారుతోంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనం, అక్రమార్కుల విందు వినోదాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు సత్తుపల్లిలో సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, వేటగాళ్ల దురాగతం మరోవైపు వెరసి మూగజీవాల ప్రాణాలను హరిస్తున్నాయి. సాక్షాత్తు అటవీ శాఖ అధికారులే వేటగాళ్లకు సహకరించారన్న వార్తలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

సత్తుపల్లి పట్టణ పరిధిలోని వేంసూరు రోడ్డులో సుమారు 375 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నీలాద్రి అర్బన్ పార్కు వన్యప్రాణుల పాలిట ప్రమాదకరంగా పరిణమించింది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య స్వేచ్ఛగా విహరించాల్సిన జింకలు వరుసగా మృత్యువాత పడుతుండటం పర్యావరణ ప్రేమికులను కలచివేస్తోంది. పార్కు నిర్వహణలో లోపాలు, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీధి కుక్కలు పార్కులోకి చొరబడి జింకల ప్రాణాలను తీస్తున్నాయి. అయితే, కేవలం కుక్కల దాడులే కాకుండా, పార్కులో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడం, బయటి వ్యక్తులు యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి జింకలను వేటాడటం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
అటవీ సంపదను కాపాడాల్సిన కొందరు అధికారులే భక్షకులుగా మారారన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇటీవల జరిగిన ఒక విందు కార్యక్రమం కోసం ఆగంతకులు పార్కులోకి ప్రవేశించి, గన్ ద్వారా జింకలను కాల్చి చంపారని, ఆ మాంసాన్ని విఐపిలకు వడ్డించారని పలువురు జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఫారెస్ట్ సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వ్యవహారం మీడియాలోనూ, పత్రికల్లోనూ ప్రముఖంగా రావడంతో స్పందించిన జిల్లా ఫారెస్ట్ అధికారి తక్షణ విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనపై నిగ్గు తేల్చేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం సత్తుపల్లికి చేరుకున్నారు. నీలాద్రి అర్బన్ పార్కులోని ఘటనా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విచారణ బృందం, స్థానిక రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ల నుండి వివరాలు సేకరించింది. వన్యప్రాణులకు రక్షణ కవచంలా ఉండాల్సిన అధికారులే, వేటగాళ్లకు మార్గదర్శకులుగా మారడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ “కంచే చేను మేసిన” చందంగా ఉందని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, విచారణ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టాస్క్ ఫోర్స్ అధికారులు పార్కును సందర్శించిన వేళ, వివరాలు సేకరించేందుకు వెళ్లిన మీడియాను అధికారులు అడ్డుకున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని, విచారణ పూర్తయిన వెంటనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పి అధికారులు దాటవేశారు. ఏది ఏమైనా, అర్బన్ పార్కులో జరుగుతున్న ఈ అరాచకాలపై నిష్పక్షపాత విచారణ జరిపి, మూగజీవాలను బలితీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Latest