Mahaa Daily Exclusive

  పదేళ్లు అండగా నిలబడండి.:కొత్తగూడెంలో ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవ సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Share

పదేళ్లు అండగా నిలబడండి.

* తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడతాం.

* అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు ఓటేయండి.

* మంత్రి-సర్పంచ్‌ సమన్వయం అవసరం.

* తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొత్తగూడెం నుంచే.

* ఖమ్మం అభివృద్ధి నా బాధ్యత.

* కృష్ణా, గోదావరి జలాలతో సిరులు కురిపిస్తాం.

*  కొత్తగూడెంలో ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవ సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

భద్రాద్రి కొత్తగూడెం,మహా.

 

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రాంతాన్ని, పదేళ్లు కేవలం కమీషన్లు, నిర్లక్ష్యంతో అన్యాయం చేసిన పాలకులకు మళ్లీ ఓటెందుకు వేయాలి?” అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ప్రతిపక్షంపై పవర్‌ పంచ్ విసిరారు. మంగళవారం  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెంలో ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవం  సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరును ఈ సంస్థకు పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన నాయకుడికి సముచిత గౌరవం దక్కిందని అన్నారు. పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ దేశాన్ని సంక్షోభం నుంచి ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి కొత్తగూడెం ప్రాంతమే స్ఫూర్తినిచ్చిందని, 1969లో తొలి ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైందని గుర్తు చేస్తూ, సింగరేణి వంటి సంస్థల అభివృద్ధికి ఈ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఖమ్మం జిల్లా మంత్రులపై తనకున్న నమ్మకాన్ని ఈ సందర్భంగా బహిరంగంగా ప్రకటించారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన శాఖలన్నీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దే ఉన్నాయని తెలిపారు. ఈ ముగ్గురు మంత్రులు తలుచుకుంటే జిల్లాలో ఏ పనైనా జరుగుతుందని, అందువల్ల జిల్లా అభివృద్ధి బాధ్యత తనతో పాటు ఈ ముఖ్యమైన బృందానిది కూడా అని స్పష్టం చేశారు. అయితే, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత మాత్రం తనదే అని హామీ ఇవ్వడం ద్వారా, జిల్లాపై తన పూర్తి అధికారాన్ని, ప్రేమను తెలియజేశారు.

 

గత పాలకుల వైఫల్యాలను సీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా విమర్శించారు. గత పదేళ్ల పాలనలో ఖమ్మం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, అవి కమీషన్లు కురిపించాయి తప్ప, పొలాల్లో నీళ్లు పారలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని మారుస్తుందని, కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా పొలాల్లో సిరులు కురిపించడానికి ప్రయత్నం చేస్తోందని హామీ ఇచ్చారు. సీతారామ సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

 

స్థానిక సంస్థల ఎన్నికలలో  ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకున్నారు. మంచి ప్రభుత్వం ఉంటేనే ఉచిత విద్యుత్, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని వివరించారు. మంచి మంత్రులు ఉన్నప్పటికీ, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలంటే మంచి సర్పంచులు కూడా ఉండాలి అని స్పష్టం చేశారు. కాబట్టి, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు రాజకీయ కక్షలు మానుకుని, అభివృద్ధి కోసమే ఓటు వేయాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.

మంచి పాలన అందిస్తున్నామని, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు మరో పదేళ్లు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అండగా నిలబడాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే, విద్య ద్వారానే తెలంగాణ ఉన్నత స్థానంలో నిలబడుతుందని చెబుతూ, ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల స్థాపన ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నమని వివరించారు.

ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అభివర్ణించిన సీఎం, గత పదేళ్లలో అన్ని రంగాల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఈ అన్యాయాన్ని సరిదిద్దుతోందని, అందుకే రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి బాధ్యత భద్రాద్రి రాముల వారి సాక్షిగా తనదేనని హామీ ఇస్తూ, జిల్లా మంత్రులు ప్రతి పథకాన్ని లబ్ధిదారుని వద్దకు తీసుకు వెళ్తున్నారని ఆయన వారి కృషిని మెచ్చుకున్నారు.

Latest