ప్లీజ్..నా వ్యాఖ్యలు వక్రీకరించవద్దు
ఎలాంటి చెడు ఉద్దేశంతో అనలేదు
వివాదాస్పద వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ
లేఖ విడుదల చేసిన జనసేన పార్టీ కార్యాలయం
విజయవాడ, మహా: కొబ్బరి తోటలకు దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తక్షణమే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని తెలంగాణ నేతలు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల రాజకీయాల్లో వివాదాస్పదమైన తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, ఆరోజు నేను ఎలాంటి చెడు ఉద్దేశంతో అనలేదని అన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి లేఖ విడుదల చేసారు. రాజోలు నియోజకవర్గంలో పర్యటించినపుడు రైతులతో ముచ్చటిస్తూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఫ్రెండ్లీ వాతావరణం చెడగొట్టేలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖ పవన్ కళ్యాణ్ నుంచి కాకుండా ఆ పార్టీ కార్యాలయం నుంచి విడుదల అయింది.





