- కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం
- కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ.. మజ్లిస్ కొమ్ముకాసే పార్టీ
- రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన బండి సంజయ్
హైదరాబాద్, మహా: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని మండిపడ్డారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని, “ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ” అని రేవంత్ రెడ్డి చెప్పడం ఇందుకు తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని ఆయన ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పలుమార్లు హిందూ దేవుళ్లను, సంస్కృతిని కించపర్చిందని, మాజీ సీఎం కేసీఆర్ సైతం హిందువులను “హిందుగాళ్లు బొందుగాళ్లు” అంటూ అవహేళన చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు.
ఈ అంశంపై హిందూ సమాజం ఇకనైనా ఆలోచించుకోవాలి అంటూ బండి సంజయ్ గళమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ గెలిస్తే హిందువులు తలెత్తుకుని తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని తాము హెచ్చరించామని, సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆ విషయాన్ని నిరూపించాయని తెలిపారు. హిందువుల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ద్వేషం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ సమాజం ఇకనైనా మేల్కొని, ఓట్ల కోసం చీలిపోయి అవమానాలను దిగమింగుకుంటూ ఉంటారో, లేక ఏకమై తమ సత్తాను చాటుకుంటారో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ బీజేపి ఏనాడూ ఇతర మతాలను కించపరచలేదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” దిశగా పనిచేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.






