- ఖర్గేకు అధికారిక ఆహ్వానం
- గ్లోబల్ సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడికి ఆహ్వానం
- తెలంగాణ గ్లోబల్ విజన్‌కు ఖర్గే ఆశీస్సులు
ఢిల్లీ, మహా: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025” కు ఆహ్వానం అందించేందుకు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి సముచితంగా ఆహ్వానించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందం కూడా పాల్గొంది. ఖర్గేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలను కూడా ఈ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా, తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉద్దేశించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ సందర్భంగా, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల పట్ల పార్టీ అధిష్టానానికి వివరించి, వారి ఆశీస్సులు పొందడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.






