Mahaa Daily Exclusive

  8వ వేతన సంఘం: పెన్షన్ రివిజన్‌పై ఊహాగానాలకు తెర; పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టత!

Share

పెన్షన్ రివిజన్‌పై ఊహాగానాలకు తెర.
* 8వ వేతన సంఘంలో సవరణపై కేంద్రం స్పష్టత!
* అనుమానాలకు తెరదించిన పార్లమెంటు వేదిక!

న్యూ ఢిల్లీ, మహా.

*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సుదీర్ఘకాలంగా నెలకొన్న ఒక ముఖ్యమైన అంశంపై ఎట్టకేలకు స్పష్టత లభించింది. ఎనిమిదో వేతన సంఘం విధివిధానాల పరిధిలోకి పెన్షన్ సవరణ అంశం వస్తుందా లేదా అనే విషయంలో అనేక వార్తలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చి, పెన్షనర్ల వర్గంలో భారీ ఊరట నింపారు.*

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పెన్షనర్ల పింఛన్ సవరణలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నియమించబడే ఎనిమిదో వేతన సంఘంపై గత కొన్ని రోజులుగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్ రివిజన్ అంశాన్ని చేర్చలేదనే ప్రచారం జరిగింది. దీనిపై పెన్షనర్ల సంఘాలు మరియు వివిధ ఉద్యోగ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, పెన్షన్ సవరణను తప్పనిసరిగా చేర్చాలని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో సహా ఉన్నతాధికారులకు లేఖలు కూడా రాశాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 2న రాజ్యసభలో ఎంపీలు జావేద్ అలీ ఖాన్, రామ్‌జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘం అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, భత్యాలతో పాటు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో పెన్షనర్లలో నెలకొన్న ఆందోళన పూర్తిగా తొలగిపోయింది. అయితే, తక్షణ ఉపశమనం కోసం ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ డియర్‌నెస్ రిలీఫ్ ను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని ఎంపీలు ప్రశ్నించగా, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి తెలిపారు. సాధారణంగా కరువు భత్యం 50 శాతానికి మించినప్పుడు దానిని బేసిక్ పేలో విలీనం చేస్తారనే విషయం తెలిసిందే. 2024 జనవరిలోనే డీఏ 50 శాతం దాటడంతో ఉద్యోగ సంఘాలు విలీనం కోసం డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనతో, పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఇప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Latest