Mahaa Daily Exclusive

  అప్పుల కోసం దారుణం: అన్న పేరు మీద $4 కోట్ల బీమా.. ఆపై కిరాతకంగా హత్య చేసిన తమ్ముడు!

Share

  • అప్పులు తీర్చడం తమ్ముడి ఉపాయం
  • అన్న పేరు మీద రూ.4 కోట్లకు బీమా చేయించి
  • ఆపై దారుణంగా హత్య చేసిన వైనం

కరీంనగర్, మహా : కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధ నుంచి బయటపడటం కోసం సొంత అన్న పేరు మీద బీమా చేయించి ఆపై హత్య చేశాడు ఒక తమ్ముడు. తన పథకంలో భాగంగా మానసిక వికలాంగుడైన అన్న పేరు మీద వివిధ బీమా కంపెనీల్లో రూ.4 కోట్లకు పైనే బీమా చేయించాడు. ఆ తర్వాత పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి అన్నను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. కానీ చివరకు బీమా అధికారులకు అనుమానం రావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా, రామడుగుకు చెందిన మామిడి నరేశ్‌(30) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం రెండు టిప్పర్లను కొనుగోలు చేశాడు. వాటిని అద్దెకు ఇస్తూ.. వచ్చిన ఆదాయంతో జీవనం సాగించేవాడు. కొన్నాళ్ల పాటు అతడి వ్యాపారం బాగానే సాగింది. అయితే గతకొన్ని నెలలుగా వ్యాపారం సరిగ్గా నడవక ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. తెలిసిన వారి దగ్గర, దొరికిన ప్రతి చోటా అప్పులు చేశాడు. వీటికి తోడు స్టాక్ మార్కెట్‌లోనూ కొంత పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అలా మొత్తం కోటిన్నర రూపాయల మేర అప్పులయ్యాయి. మరోవైపు తమ డబ్బులు చెల్లించాల్సిందిగా అప్పు ఇచ్చిన వాళ్లు అడగడం మొదలు పెట్టారు. చేతిలో అంత మొత్తం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. మానసికంగా సరిగా ఎదకక ఇంట్లోనే ఉంటున్న అన్న వెంకటేష్ (37) మీద అతడి కన్ను పడింది. అన్న పేరు మీద బీమా చేయించి ఆపై అతడిని చంపి అప్పులు తీర్చుకోవాలని భావించాడు.

పథకంలో భాగంగా ముందుగా వెంకటేష్ పేరు మీద 4 ప్రైవేటు బీమా కంపెనీలతోపాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి కూడా వేర్వేరుగా సుమారు రూ. 4.14 కోటు బీమా చేయించాడు. ఇదిలా ఉండగా నముండ్ల రాకేశ్‌ (28) అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన రూ.7 లక్షల కోసం నరేశ్‌పై ఒత్తిడి తెచ్చాడు. దాంతో నరేష్ అన్నను చంపి అప్పులు తీర్చుకోవాలనుకుంటున్న తన ప్లాన్ గురించి రాకేశ్‌కు చెప్పాడు. పథకంలో తనకు సహకరిస్తే రాకేశ్‌కు ఇవ్వాల్సిన రూ. 7 లక్షలకు అదనంగా రూ. 13 లక్షలు ఇస్తానని చెప్పి.. ఒప్పించాడు. అలానే అతడి వద్ద ట్రిప్పర్ డ్రైవర్‌గా పని చేసే ప్రదీప్‌కు రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పించి తమతో కలుపుకున్నాడు. ఒకవేళ తమ ప్లాన్ గురించి బయట పడితే అందరు శిక్షను భరించాలని నరేష్, రాకేశ్, ప్రదీప్ ముగ్గురూ కనపడే విధంగా ఒప్పందం చేసుకుని దాన్ని వీడియో కూడా తీసుకున్నారు. తమ ప్లాన్‌లో భాగంగా నవంబర్ 29 న రాత్రి సమయంలో డ్రైవర్ ప్రదీప్ యజమాని నరేష్‌కు కాల్ చేసి ఊరి దగ్గర ట్రిప్పర్ ఆగిపోయిందని తెలిపాడు. ఇది విన్న నరేష్ తన అల్లుడు సాయి బైక్‌పై అన్న వెంకటేశ్‌ను టిప్పర్‌ వద్దకు పంపించాడు. నరేశ్‌ కూడా వెనకాలే వెళ్లాడు. ఆ తర్వాత టిప్పర్‌ చక్రం కింద జాకీ పెట్టాలని చెప్పి వెంకటేశ్‌ని కింద పడుకోబెట్టి ఆపై నరేశ్‌ టిప్పర్‌ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్‌ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదవశాత్తు వెంకటేష్ చనిపోయినట్లు పోలీసులకు తెలిపాడు. వెంకటేష్ చనిపోయాడని తెలుసుకున్న బీమా కంపెనీల ప్రతినిధులు నవంబర్ 30న విచారణకు వచ్చారు. అయితే నరేశ్‌ చెప్పిన విధానంపై వారికి అనుమానం వచ్చింది. దీని గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పూర్తిస్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లు తేలడంతో నరేశ్‌తోపాటు రాకేశ్, ప్రదీప్‌లను అరెస్ట్‌ చేశారు. భీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడి వైనం తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల వారు మారుతున్న మనుషులు, స్వార్థం ఎంతకు దారి తీసిందో అని చర్చించుకుంటున్నారు.

Latest