- దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణలో
- హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ కూడా ఏర్పాటు
పలు రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం.. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8,9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ సమ్మిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకుంటాయని భావిస్తున్నారు. అలానే ఈ సమ్మిట్ వేదికగా క్రీడారంగానికి సంబంధించి కీలక ముందడుగు పడనుంది.
దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలో రెండో మహిళల ఫుట్ బాల్ అకాడమీ ఇదే కావడం విశేషం. దీంతో పాటు దేశంలో రెండో మెన్స్ ఫుట్‌బాల్ అకాడమీని కూడా రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. వీటితో పాటు భాగ్యనగరంలో అంతర్జాతీయ చెస్ నిర్వహణకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ అకాడమీ ఏర్పాటుపై తెలంగాణ ఫిఫా – ఏఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) సంయుక్తంగా ప్రకటన చేయనున్నాయి. ఈ సమ్మిట్‌లో భాగంగానే దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీని కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించబోతున్నారు. అలాగే హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కూడా ప్రకటన వెలువడనుంది.
డిసెంబర్ 8, 9 తేదీల్లో.. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు వివిధ రాష్ట్రాల సీఎంలను స్వయంగా కలిసి ఆహ్వానించే బాధ్యతలను అప్పగించారు. ఈక్రమంలో డిసెంబర్ 4న మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి.. ఆహ్వాన లేఖలు అందిస్తారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం ప్రధాన మంత్రితో సహా పలువురుకేంద్ర మంత్రులకు ఆహ్వానాలను అందించారు. మిగతా వారికి తెలంగాణ ఎంపీలు ఆహ్వాన లేఖలు అందజేయనున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు, అతిథులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బహుమతులతో కూడిన బాస్కెట్లను అందజేయనుంది. ఈ సమిట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్ విచ్చేస్తున్న అతిథులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు నగరంలో అడుగుపెట్టగానే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగత సత్కారాలు చేసి ఒక బాస్కెట్‌ను అందిస్తారు. ఈ బాస్కెట్లో సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్, హైదరాబాద్ అత్తర్, ముత్యాలతో చేసిన ఆభరణాలు, పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్ (పెయింటింగ్స్) ఉంటాయి. వీటితో పాటు అప్పాలు, సకినాలు, మహువా లడ్డూలు, బాదామ్ కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు కూడా ఉండేలా సిద్దం చేస్తున్నారు.






